Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన హర్యానా ఐజీ!

  • ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం
  • భార్య, ఐఏఎస్ అధికారిణి జపాన్ పర్యటనలో
  • ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యం కాలేదు
  • వృత్తిగత, వ్యక్తిగత కారణాలపై పోలీసుల దర్యాప్తు
  • ఇటీవలే రోహ్‌తక్ జైలుకు బదిలీ అయిన అధికారి

హర్యానా పోలీస్ శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) వై. పురాణ్ కుమార్ (52) చండీగఢ్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడటం పోలీస్, పరిపాలనా వర్గాల్లో దిగ్భ్రాంతిని కలిగించింది.

వివరాల్లోకి వెళితే.. చండీగఢ్‌లోని సెక్టార్ 11లో ఉన్న ఆయన ఇంటి బేస్‌మెంట్‌లో పురాణ్ కుమార్ మృతదేహాన్ని మొదట ఆయన కుమార్తె గుర్తించారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో తమకు సమాచారం అందిందని చండీగఢ్ ఎస్‌పీ కన్వర్‌దీప్ కౌర్ మీడియాకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని ఆమె వివరించారు.

పురాణ్ కుమార్ భార్య అమ్నీత్ పి కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి. ఆమె ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని అధికారిక ప్రతినిధుల బృందంతో కలిసి జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆమె బుధవారం భారత్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. పురాణ్ కుమార్ మొబైల్ ఫోన్లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, పురాణ్ కుమార్ సోమవారం తన గన్‌మ్యాన్ నుంచి తుపాకీ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెలలోనే ఆయన్ను రోహ్‌తక్‌లోని సునారియా జైలుకు బదిలీ చేశారు. గతంలో పురాణ్ కుమార్ కొందరు ఐపీఎస్ అధికారుల ప్రమోషన్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఆయన ఆత్మహత్యకు వృత్తిపరమైన ఒత్తిళ్లు లేదా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పురాణ్ కుమార్ అకాల మరణంపై పలువురు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

Related posts

బెంగాల్‌లో కలకలం.. చెరువులో వేలకొద్దీ ఆధార్ కార్డులు…

Ram Narayana

అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న 25 యాప్‌లపై కేంద్రం కొరడా!

Ram Narayana

 దీపావళి వేడుకలు జరుపుకోవద్దు… పార్టీ నేతలకు హీరో విజయ్ ఆదేశం!

Ram Narayana

Leave a Comment