
- అడ్లూరి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు
- అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు …తాను ఆలా అనలేదని అడ్లూరి మాటలు గురించి తాను పట్టించుకోనని పొన్న ప్రభాకర్ పేర్కొన్నారు …ఇది ముగ్గురు మంత్రుల మధ్య పంచాయతీగా మరి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది …ఇప్పటికే పొన్నంపై ఎస్సీ ,ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు అందింది …మంత్రి వివేక్ వివరణ ఇచ్చారు ..మంద కృష్ణ మాదిగ తన సామజిక వర్గ మంత్రిపై పొన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేశారు …
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు దాఖలైంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
సహచర మంత్రి అన్న విజ్ఞత లేకుండా, ప్రజల్లో ఉన్నామనే ఆలోచన లేకుండా మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి లక్ష్మణ్‌ను దూషించడం సరికాదని, దీనిని తాము ఖండిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను తక్షణమో సుమోటోగా స్వీకరించి అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు కమిషన్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిల దృష్టికి తీసుకువెళ్లాలని వారు కోరారు.
- పొన్నం మాదిరిగా తాను అహంకారంగా మాట్లాడనన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్
- అడ్లూరి వ్యాఖ్యలపై స్పందించబోనన్న పొన్నం ప్రభాకర్
- పార్టీ పరంగా మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన ఆదేశాలు పాటిస్తానని స్పష్టీకరణ
- ఆ మంత్రి నాపై చేసిన వ్యాఖ్యలకు స్పందించను!: మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనను అహంకారిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తనతో మాట్లాడారని, ఆయనతో జరిగిన సంభాషణే ఫైనల్ అని పొన్నం తెలిపారు.
రహ్మత్ నగర్ సమావేశంలో చోటుచేసుకున్న విషయాలను పీసీసీ అధ్యక్షుడికి వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ పరంగా మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని ఆయన అన్నారు.
ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌తో విభేదాల గురించి ప్రశ్నించగా అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. పొన్నం మాదిరిగా అహంకారపూరితంగా మాట్లాడటం తనకు రాదని ఆయన అన్నారు. పొన్నం తన వైఖరిని మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ పెద్దలను కలుస్తానని కూడా ఆయన తెలిపారు.
పొన్నంపై అడ్లూరి లక్ష్మణ్ బహిరంగంగా విమర్శలు చేయడంతో పీసీసీ చీఫ్ స్పందించారు. అడ్లూరి లక్ష్మణ్‌కు ఫోన్ చేసి ఇరువురు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ తనపై చేసిన వ్యాఖ్యల మీద స్పందించేందుకు పొన్నం ప్రభాకర్ నిరాకరించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై పొన్నం ప్రభాకర్ వ్యాఖ్య.. మంద కృష్ణ మాదిగ ఆగ్రహం!
- మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రిని అవమానించారని మండిపాటు
- మంత్రి వివేక్ ఆ వ్యాఖ్యలను ఖండించకపోగా సమర్థించినట్లు హావభావాలు ప్రదర్శించారని విమర్శ
- సమస్య త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రంగా స్పందించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ను పొన్నం ప్రభాకర్ “దున్నపోతు” అని సంబోధించడం దారుణమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను తోటి దళిత మంత్రి వివేక్ ఖండించకపోగా, సమర్థించినట్లు హావభావాలు ప్రదర్శించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడ్లూరి లక్ష్మణ్ మీద పొన్నం చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దళితులు, బలహీనవర్గాల మధ్య వివాదం పెరగడం మంచిది కాదనే ఉద్దేశంతో తాను వెంటనే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు ఫోన్ చేశానని తెలిపారు. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని చూస్తున్నామని అన్నారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పే వరకు సమస్య పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు.
అడ్లూరి లక్ష్మణ్ పరిధిలో ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి అరగంట ముందుగా వెళ్లి లక్ష్మణ్ రాలేదని మాట్లాడటం ఏమిటని నిలదీశారు. ఆ శాఖలో పొన్నం, వివేక్ జోక్యం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ శాఖల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. పొన్నం అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వివేక్ వారించాల్సిందని అన్నారు.
లక్ష్మణ్ ఆలస్యంగా వస్తే మేం ఉండలేమని వారు చెప్పారని, కానీ వారిని రమ్మన్నది ఎవరు, వెళ్లమన్నది ఎవరని మండిపడ్డారు. లక్ష్మణ్‌ను వివేక్ గతంలోనే అవమానించారని, తన తండ్రి కాకా 96వ జయంతి ఉత్సవాలకు ఆయనను ఆహ్వానించలేదని విమర్శించారు. తోటి మాల సోదరుడు తోటి మాదిగ మంత్రిని ఆహ్వానించకపోతే ఎలాగని ప్రశ్నించారు.
మంత్రి అడ్లూరి వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి ఎందుకు వెళ్లిపోయానంటే?: మంత్రి వివేక్ వివరణ
- మీనాక్షి నటరాజన్‌తో సమావేశం ఉండటం వల్లే మధ్యలో వెళ్లిపోయానన్న వివేక్
- హైదరాబాద్‌కు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానన్న వివేక్
- తాను వచ్చి కూర్చుంటే వివేక్ వెళ్లిపోయారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపణ
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తన పక్క సీటులో కూర్చున్న సమయంలో తాను ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోవలసి వచ్చిందో మంత్రి వివేక్ వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సమావేశం ఉండటం వల్ల తాను మధ్యలో వెళ్లిపోవలసి వచ్చిందని వివేక్ తెలిపారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేనని, తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని ఆయన అన్నారు.
ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, ఒక కార్యక్రమంలో తాను వచ్చి కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోయారని, తాను పక్కన కూర్చుంటే ఆయన ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. మంత్రి వివేక్‌లా తన వద్ద డబ్బులు లేవని ఆయన అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కూడా ఆయన విమర్శలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై వివేక్ స్పందిస్తూ, మీనాక్షి నటరాజన్‌తో సమావేశం ఉండటం వల్లే తాను అక్కడి నుంచి లేచి వచ్చానని, ఈ విషయాన్ని పక్కన ఉన్న మంత్రులకు కూడా తెలియజేశానని అన్నారు. ఎవర్నీ విమర్శించాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేశారో అర్థం కావడం లేదని అన్నారు. ఆయన మీద తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.
ఏం జరిగింది?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి లక్ష్మణ్ సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం ప్రభాకర్, వివేక్ చెవిలో అడ్లూరి లక్ష్మణ్ గురించి గుసగుసలాడినట్లుగా వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ దీనిని ఖండించారు. ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ వచ్చి కూర్చున్న సమయంలో వివేక్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. ఇది వివాదానికి దారితీసింది.

