Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ప్రజాభిప్రాయం మేరకే మాజీ సర్పంచ్ రమేష్ ను కాల్చి చంపాం …మావోయిస్టులు !

ఆ మాజీ సర్పంచ్‌ను మావోలు కాల్చిచంపారు.. ఇన్ఫార్మర్‌గా పనిచేసినందుకేనన్న నక్సల్స్

  • రమేశ్‌ను వెంకటాపురం ఎస్సై ఇన్ఫార్మర్‌గా మార్చుకున్నారు
  • పోలీసుల నుంచి రమేశ్ రూ. 2 లక్షలు తీసుకున్నాడు
  • రమేశ్ తన నేరాన్ని అంగీకరించినట్టుగా ఉన్న ఆడియో వాట్సాప్‌లో విడుదల
  • ప్రజాభిప్రాయం మేరకే చంపేశామన్న మావోలు

ములుగు జిల్లాలో కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్‌ను నక్సల్స్ కాల్చి చంపారు. జిల్లాలోని వెంకటాపురం మండలం కె. కొండాపురానికి చెందిన కొర్స రమేశ్ (33) 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ కార్యకర్తగా ఉన్నారు. ఆయన భార్య రజితకు ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రిలో ఏఎన్ఎం ఉద్యోగం రావడంతో అక్కడి ఐటీడీఏ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేశ్‌ను కె.కొండాపురం వద్ద మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రమేశ్ 24 గంటలు దాటినా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆరా తీశారు. దీంతో ఆయన కిడ్నాప్‌కు గురైనట్టు తెలిసింది. కొందరు ముసుగు వ్యక్తులు రమేశ్‌ను బలవంతంగా వాహనం ఎక్కించి తీసుకెళ్లినట్టు కె. కొండాపురం గ్రామస్థులు కొందరు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. తన భర్తకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని, క్షేమంగా విడిచిపెట్టాలని మావోయిస్టులను రజిత అభ్యర్థించారు.

అయితే, వారి అభ్యర్థనను మావోలు పట్టించుకోలేదు. నోట్లో తుపాకి పెట్టి కాల్చి చంపేశారు. అనంతరం జిల్లా సరిహద్దులోని ప్రధాన మార్గానికి 8 కిలోమీటర్ల దూరంలో చత్తీస్‌గఢ్ రాష్ట్రం కొత్తపల్లి శివారు అంతర్గత రహదారిపై రమేశ్ మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. రక్తపు మరకల ఆధారంగా బుధవారమే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అంచనా వేశారు.

రమేశ్ మృతదేహం వద్ద వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ లభించింది. వెంకటాపురం ఎస్సై జి.తిరుపతి.. రమేశ్‌ను ఇన్ఫార్మర్‌గా మార్చారని అందులో ఆరోపించారు. తాము అడిగే వస్తువులను అతడితో పంపిస్తూ సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా తమ కదలికలను గుర్తించే ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా విషం కలిపిన పాలపొడిని కూడా రమేశ్‌తో పంపించారని, దానిని తాగిన దళ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు.

మ్యాదరి భిక్షపతి అలియాస్ విజేందర్ ఆ పాలు తాగి అమరుడయ్యాడని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీకి ద్రోహం చేసి పోలీసుల నుంచి రమేశ్ రూ. 2 లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. తాను చేసిన తప్పును అతడు అంగీకరించాడని పేర్కొంటూ అందుకు సంబంధించిన వాయిస్ రికార్డును వాట్సాప్‌లో విడుదల చేశారు. ప్రజాభిప్రాయం మేరకే అతడిని చంపుతున్నట్టు మావోలు ఆ లేఖలో పేర్కొన్నారు.

Related posts

అత్యాచారాలు పెరిగిపోతుండడంతో పాక్ లోని పంజాబ్ లో ఎమర్జెన్సీ!

Drukpadam

వృద్ధురాలిని చితకబాది కారు చోరీ చేశాడు… పారిపోయే క్రమంలో…!

Drukpadam

హంతకుడిని పట్టిచ్చిన హెడ్ సెట్…

Ram Narayana

Leave a Comment