ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడి నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుత కొత్త నాయకుడు మొజ్తబా ఖమేనీ సెకన్ల వ్యవధిలో ప్రాణాలతో బయటపడ్డారు. ‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. క్షిపణులు భవనాన్ని తాకడానికి కొద్ది క్షణాల ముందే మొజ్తబా గది నుంచి బయటకు వచ్చి తోటలోకి వెళ్లడంతో ఆయన ప్రాణాలు దక్కాయి.
ఇరాన్ అధికారుల రహస్య సమావేశానికి సంబంధించిన ఒక ఆడియో లీక్ కావడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. “దేవుని సంకల్పం వల్లే మొజ్తబా క్షిపణి దాడికి ముందే ఏదో పని మీద బయటకు వచ్చి తోటలోకి వెళ్లారు. ఆయన మెట్లు ఎక్కుతున్న సమయంలోనే క్షిపణులు భవనాన్ని తాకాయి” అని ఖమేనీ కార్యాలయ ప్రోటోకాల్ హెడ్ మజహర్ హొస్సేనీ ఆ ఆడియోలో పేర్కొన్నారు. ఈ దాడిలో మొజ్తబా కాలికి స్వల్ప గాయం మాత్రమే అయిందని ఆయన వెల్లడించారు.
లీకైన ఆడియో ప్రకారం.. మొత్తం మూడు క్షిపణులు ఆ భవనంపై పడ్డాయి. అందులో ఒకటి నేరుగా అలీ ఖమేనీ ఉన్న గదిపై పడటంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ షిరాజీ శరీరం ఈ బాంబు దాడికి ఛిన్నాభిన్నమైందని, ఆయన అవశేషాలను కూడా గుర్తుపట్టలేనంతగా పరిస్థితి ఉందని హొస్సేనీ వివరించారు. మొజ్తబా బావ మిస్బా అల్ హుదా బఘేరి కనీ కూడా ఈ దాడిలో తల సగానికి తెగిపోయి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
అయితే మొజ్తబా ఖమేనీ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి జరిగినప్పటి నుంచి ఆయన ప్రజల ముందుకు రాకపోవడంతో.. “చాలామంది ఆయన చనిపోయాడని అంటున్నారు, మరికొందరు ఆయన ముఖం పూర్తిగా వికృతమైందని చెబుతున్నారు. ఆయన అసలు బతికే ఉన్నాడో లేదో మాకు తెలియదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ స్టేట్ టెలివిజన్ మాత్రం మొజ్తబా ఇచ్చిన రాతపూర్వక సందేశాన్ని మాత్రమే ప్రసారం చేస్తోంది, దీంతో ఆయన ఆరోగ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: