ఢిల్లీలో డాక్టర్లు వర్సెస్ పోలీసులు.. ఉద్రిక్త పరిస్థితులు
- సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
- సఫ్దర్ జంగ్ ఆసుపత్రి ప్రధాన ద్వారాల మూసివేత
- ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని పోలీసుల ప్రకటన
- పోలీసులు దాడి చేశారంటూ రెసిడెంట్ డాక్టర్ల మండిపాటు
- వెంటనే నీట్ కౌన్సెలింగ్ జరపాలంటూ ఆందోళనలు
ఢిల్లీలో వైద్యుల ఆందోళనలో రెండో రోజూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ను (నీట్) పెట్టి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన రెసిడెంట్ డాక్టర్లు.. సేవలను నిలిపేసి నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న పోలీసులు, వైద్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇవాళ కూడా అదే స్థాయిలో పోలీసులు, డాక్టర్ల మధ్య తోపులాట జరిగింది. సుప్రీంకోర్టుకు ర్యాలీగా బయల్దేరి వెళుతున్న రెసిడెంట్ డాక్టర్లను పోలీసులు సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వద్దే ఆపేశారు. ఆసుపత్రి ప్రధాన ద్వారాలన్నింటినీ పోలీసులు మూసేశారు. గత రాత్రి పోలీసులు తమపై దాడికి దిగారని కొందరు రెసిడెంట్ డాక్టర్లు ఆరోపించారు. అలాంటిదేమీ లేదని పోలీసులు చెబుతున్నా.. రెండు వర్గాల మధ్య జరిగిన తోపులాటకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
రెసిడెంట్ డాక్టర్లంతా నిబంధనలను అతిక్రమించి గుమికూడారని, అందుకే అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ప్రధాన దారులన్నింటినీ బ్లాక్ చేశారని చెప్పారు. అయితే, కేసులేవీ పెట్టకుండా అందరినీ విడిచిపెట్టామని తెలిపారు. ఇవాళ ఎట్టిపరిస్థితుల్లోనూ సఫ్దర్ జంగ్ ఆసుపత్రిని దాటి వారిని వెళ్లనివ్వబోమని తేల్చి చెప్పారు. క్యాంపస్ లోనే ఆపేస్తామని స్పష్టం చేశారు.
కాగా, సఫ్దర్ జంగ్ ఆసుపత్రితో పాటు లేడీ హెర్డింగే మెడికల్ కాలేజ్, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్, గోవింద్ బల్లభ్ పంత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడకల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. వైద్యుల ధర్నాతో ఇవాళ చికిత్స చేయించుకోవాల్సి ఉన్న వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ ఆసుపత్రులే కాకుండా చాచా నెహ్రూ ఆసుపత్రిలోనూ సేవలను నిలిపేయాల్సిందిగా రెసిడెంట్ డాక్టర్ల సంఘానికి ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) పిలుపునిచ్చింది.