10 మంది సంపదతో చిన్నారులు అందరికీ ఉచిత విద్య..!.. ఖర్చు పెట్టినా తరగనంత నిధి
- దేశంలో 142 మంది బిలియనీర్లు
- వీరి వద్ద రూ.53 లక్షల కోట్లు
- 98 మంది సంపద.. 55 కోట్ల ప్రజల ఆస్తికి సమానం
- ఆక్స్ ఫామ్ ఇన్ ఈక్వాలిటీ సర్వే
2021లో భారత బిలియనీర్ల సంపద (ఒక బిలియన్ డాలర్, అంతకుమించి సంపద ఉన్నవారు) రెట్టింపునకు పైగా పెరిగింది. అంతేకాదు 2020 నాటికి దేశంలో 39 బిలియనీర్లు ఉంటే, వారి సంఖ్య గతేడాది 142కు విస్తరించింది. ఈ వివరాలను ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు దావోస్ వేదికగా నేడు జరగనుంది. ఆన్ లైన్ మాధ్యమంలో దీన్ని నిర్వహిస్తుండగా, ప్రదాని నరేంద్ర మోదీ సదస్సును ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడనున్నారు.
భారత్ లోని టాప్ 10 (విలువ పరంగా) ధనవంతుల వద్దనున్న సంపదతో దేశంలోని పిల్లలు అందరికీ పాఠశాల, ఉన్నత విద్యను 25 ఏళ్లపాటు ఉచితంగా అందించొచ్చు. ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు మొదటి రోజు ఆక్స్ ఫామ్ ‘అసమానతల‘పై సర్వే వివరాలను వెల్లడిస్తుంటుంది.
భారత్ లోని టాప్ 98 ధనవంతులపై ఒక్క శాతం సంపద పన్నును వసూలు చేసినా ఆయుష్మాన్ భారత్ పథకానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ అన్నది ఆరోగ్యశ్రీ మాదిరే దేశవ్యాప్తంగా పేద ప్రజలకు ఆరోగ్య బీమాను అందించే సాధనం.
2021లో 142 భారత బిలియనీర్ల వద్ద ఉమ్మడిగా ఉన్న సంపద విలువ 719 బిలియన్ డాలర్లు. సుమారు 53 లక్షల కోట్లు. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద అయితే ఉందో.. 98 మంది సంపన్నుల దగ్గరా అంతే మేర (రూ.49 లక్షల కోట్లు) ఉంది. పది మంది అత్యంత సంపన్నులు రోజూ మిలియన్ డాలర్ల చొప్పున (రూ.7.4కోట్లు) ఖర్చు పెట్టుకుంటూ వెళ్లినా కానీ వారి సంపద కరిగిపోయేందుక 84 ఏళ్లు పడుతుందని ఆక్స్ ఫామ్ తెలిపింది.