బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో టీఎస్ ప్రజా ప్రతినిధులు!
- ఇద్దరు వ్యాపారవేత్తలను విచారించిన పోలీసులు
- నలుగురు ఎమ్మెల్యేల పేర్లు చెప్పిన నిందితులు
- జాబితాలో టాలీవుడ్ ప్రముఖుడు కూడా
బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల పేర్లు బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. బెంగళూరులో పబ్ లు హోటల్స్ నిర్వహిస్తున్న హైదరాబాద్ వ్యాపారవేత్తలు సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డిలను విచారించిన పోలీసులు, వీరు నిత్యమూ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలకు పార్టీలు ఇచ్చారని, కన్నడ సినిమాలకు ఫైనాన్స్ చేస్తూ, వారితోనూ సంబంధాలు కలిగివున్నారని తేల్చారు.
కొంతకాలం క్రితం ఓ నైజీరియన్ ను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా, వీరిద్దరి పేర్లూ బయటకు వచ్చినసంగతి తెలిసిందే. ఆపై వీనిని విచారించగా, నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఓ టాలీవుడ్ ప్రముఖుడి పేరు బయటకు వచ్చింది. వీరిలో ఒక ఎమ్మెల్యే నేరుగా కొకైన్ ను కొనుగోలు చేసి తీసుకుని వెళ్లినట్టు కూడా వీరు తెలిపారు. అతని కోరిక మేరకు పలుమార్లు కొకైన్ ను పంపించామని సందీప్ వెల్లడించినట్టు విచారణ వర్గాలు వెల్లడించాయి.
అతనితో పాటునలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ కొన్నారని చెప్పడంతో వీరందరినీ విచారించాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. ఇప్పటివరకూ వారి పేర్లు మాత్రం బయటకు రాకపోయినా, ఈ విషయం అధికార టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది. డ్రగ్స్ దందాలో భాగం పంచుకున్న వారు ఎవరన్న విషయమై పెద్ద చర్చే జరుగుతోంది.