కాంగ్రెస్ అధినేత్రి సోనియాను విచారించిన ఈడీ భగ్గుమన్న కాంగ్రెస్…
-సోనియాకు మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు.. 56 మంది ఎంపీల అరెస్ట్
-నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరైన సోనియా
-రెండు గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు
-దేశవ్యాప్తంగా నిరసన తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు
-ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-నేడు కూడా కొన్ని చోట్ల వర్షంలోనూ నిరసనలు అరెస్టులు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని ఈడీ నిన్న ప్రశ్నించింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ విచారణలో 25కు పైగా ప్రశ్నలు సంధించింది. అనంతరం ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మరోమారు సమన్లు జారీ చేసింది. మరోవైపు, సోనియాను విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.నిరసనలు అక్కడక్కడా ఉద్రిక్తతలకు దారితీశాయి. గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. ఎప్పుడో ముగిసిన కేసును తిరగదోడి ఇబ్బందులకు గురిచేయడం పై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. బెంగళూరులో ఓ కారును తగలబెట్టారు. ఢిల్లీలో నిరసన తెలిపిన మొత్తం 349 కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 56 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న వారిలో పార్టీ సీనియర్ నేతలు పి.చిదంబరం, అజయ్ మాకెన్, అధీర్ రంజన్, మాణికం ఠాగూర్, కె.సురేష్, శశిథరూర్ వంటి నేతలు ఉన్నారు.
దేశంలో వివిధ ప్రాంతాల్లో నేడు కూడా ప్రదర్శనలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు . ఖమ్మం లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ప్రదర్శన నిర్వహించారు . అనంతరం రైల్వే స్టేషన్ లోకి తోసికొని పోయిన కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .