కేంద్రం తీరుపై తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీల ఆగ్రహం!
- నిన్న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
- స్పందించిన కాంగ్రెస్ మాజీ ఎంపీలు
- తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని బలరాం నాయక్ వెల్లడి
- తెలంగాణ కోసం స్వపక్షంలో విపక్ష పాత్ర పోషించామన్న రాజయ్య
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యలను కేంద్రం పరిష్కరించడంలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజానీకానికి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ బలరాం నాయక్ స్పందిస్తూ, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఉద్ఘాటించారు. మా పోరాటంతో ఏకీభవించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు అని నాయక్ వెల్లడించారు.
సురేష్ షెట్కార్ మాట్లాడుతూ… కేంద్రం, రాష్ట్రంలో బఫూన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునఃప్రారంభం ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని స్పష్టం చేశారు.
సిరిసిల్ల రాజయ్య స్పందిస్తూ, తెలంగాణ కోసం స్వపక్షంలో విపక్ష పాత్ర పోషించామని అన్నారు. విభజన హామీల్లో వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసినా, దానిని అమలు చేయలేని దుస్థితి బీజేపీదని తెలిపారు.