పాకిస్థాన్ లో పోలీస్ స్టేషన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు!
- ఖైబర్ ఫక్తూంఖ్వాలోని పీఎస్ ను ఆక్రమించుకున్న తెహ్రీక్ ఇ తాలిబన్
- స్టేషన్ లోని ఉగ్రవాదులను తీసుకెళ్లిన వైనం
- ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పాకిస్థాన్ లోని ఒక పోలీస్ స్టేషన్ ను తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించారు. ఖైబర్ ఫక్తూంఖ్వాలోని పోలీస్ స్టేషన్ ను తాలిబన్లు ఆక్రమించినట్టు పాకిస్థాన్ లోని ప్రధాన వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. పాకిస్థాన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… బన్ను కంటోన్మెంట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ను తెహ్రీక్ ఇ తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అక్కడ బందీలుగా ఉన్న ఆ సంస్థ ఉగ్రవాదులను తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ లోని కౌంటర్ టెర్రరిజం బలగాలను తమ అధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు తమ వారిని విడిపించుకుపోయారు.
దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుంటామని తెలిపారు. పోలీస్ స్టేషన్ పై బయటి నుంచి దాడి చేశారా? లేదా పీఎస్ లో అధికారులతో అంతర్గతంగా కుమ్మక్కయి చేశారా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.