Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పేపర్ లీక్ దుమారం: టీఎస్ పీఎస్సీ ఆఫీస్ వద్ద రణరంగం!

పేపర్ లీక్ దుమారం: టీఎస్ పీఎస్సీ ఆఫీస్ వద్ద రణరంగం!

  • టీఎస్ పీఎస్సీ ఆఫీస్ దగ్గర విద్యార్థి సంఘాల ఆందోళనలు
  • కమిషన్ బోర్డును పీకి పడేసిన వైనం 
  • గేట్లు దూకి.. లోనికి వెళ్లేందుకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు

టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఘటన సంచలనం రేపుతోంది. కమిషన్ లో పని చేస్తున్న ఉద్యోగి ప్రశ్నపత్రాన్ని లీక్ చేయడం, అతడు గ్రూప్ 1 పరీక్ష కూడా రాయడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఇచ్చి.. పేపర్లు లీక్ చేసి, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారంటూ బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం బీజేవైఎం, టీజేఎస్ విద్యార్థి సంఘం భగ్గుమన్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ బోర్డును విద్యార్థి నేతలు పీకేశారు. గేట్లు దూకి.. ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. విద్యార్థుల ఆందోళనలతో టీఎస్ పీఎస్సీ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి.

పేపర్ లీకేజీలు ప్రగతిభవన్ డైరెక్షన్ లో జరుగుతున్నాయంటూ నేతలు ఆరోపించారు. గ్రూప్ 1, ఇతర పరీక్షల పేపర్లు కూడా లీక్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. పరీక్షల పేపర్లను కాపాడుకోకపోతే టీఎస్ పీఎస్సీ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 

టీఎస్ పీఎస్సీలో మరో సంచలనం

  • గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు
  • ఇటీవల జరిగిన గ్రూప్ 1 పరీక్ష రాసిన పీఏ ప్రవీణ్
  • 103 మార్కులు వచ్చినా అర్హత సాధించకపోవడంతో సందేహాలు
tspsc Groups paper leak

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కమిషన్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ ప్రధాన నిందితుడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రవీణ్ తోపాటు తొమ్మిది మందిని ఈ కేసులో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్ గతేడాది జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కూడా రాశాడు. ఈ పరీక్షలో 103 మార్కులు వచ్చినా ప్రవీణ్ మెయిన్స్ కు అర్హత సాధించలేదు. దీనిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రవీణ్ సామాజిక వర్గానికి ఉన్న రిజర్వేషన్ వల్ల 103 మార్కులు వచ్చిన అభ్యర్థి తప్పనిసరిగా మెయిన్స్ కు అర్హత సాధిస్తారని అధికారులు వివరించారు. అయితే, ప్రవీణ్ మెయిన్స్ కు ఎందుకు సెలక్ట్ కాలేదు, దీని వెనకున్న మతలబు ఏంటనేది ఆరా తీస్తున్నారు. అధికారులు ప్రవీణ్ జవాబుపత్రాన్ని పరిశీలించగా.. ఓఎంఆర్ షీట్ లో రాంగ్ బబ్లింగ్ చేసినట్లు బయటపడింది. దీనివల్లే ప్రవీణ్ మెయిన్స్ కు అర్హత సాధించలేదని తేలింది. అయితే, ప్రిలిమ్స్ లో అన్ని మార్కులు సాధించేంత ప్రతిభ ప్రవీణ్ కు ఉందా.. ఆ పేపర్ కూడా లీక్ చేశాడా? అనే సందేహంతో అధికారులు విచారణ జరుపుతున్నారు.

అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షపత్రం లీక్ చేసిన కమిషన్ సెక్రెటరీ పీఏ ప్రవీణ్ మరిన్ని అక్రమాలకు పాల్పడి ఉంటాడనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఏఈ పరీక్ష పత్రం పేపర్ లీక్ వ్యవహారంలో ప్రవీణ్ తో పాటు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ ఫోన్ ను పరిశీలించగా.. అందులో చాలామంది మహిళలకు సంబంధించిన నగ్న చిత్రాలు, అసభ్య చాటింగ్ వివరాలు బయటపడ్డాయి. మరికొన్ని మెసేజ్ లు, చాటింగ్ లకు సంబంధించి డిలీట్ చేసిన మెసేజ్ లను రాబట్టేందుకు నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ల్యాబ్ ఇచ్చే రిపోర్టుతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయిందీ, లేనిదీ తెలిసిపోతుందని అధికారులు భావిస్తున్నారు.

Related posts

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేయ‌నున్న‌ ఏపీ ఎమ్మెల్యే!

Drukpadam

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా:మంత్రి హరీశ్‌ రావు!

Drukpadam

విజయవాడ స‌ర్కారీ స్కూల్లో సింగిల్ సీటు కోసం పోటీ ప‌రీక్ష‌!…

Drukpadam

Leave a Comment