కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఒకే విడతలో ఎన్నికలు.. తొలిసారి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం
- మే 10న కర్ణాటక శాసనసభకు ఎన్నికలు
- మొత్తం స్థానాలకు ఒకే రోజున పోలింగ్
- మే 13న ఫలితాల విడుదల
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మే 10న కర్ణాటక శాసనసభకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించబోతున్నట్టు చెప్పారు. మే 13న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. మొత్తం 25,282 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఎన్నికల నేపథ్యంలో డబ్బులు, మద్యం పంచకుండా చూసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం 2,400 సర్వైలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 171 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. మరోవైపు దేశంలోనే తొలిసారి ఓట్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించనున్నట్టు సీఈసీ తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్పారు.