Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ ఎవరైనా చేయవచ్చా..?

ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ ఎవరైనా చేయవచ్చా..?

  • కాలేయ సమస్యల్లేని వారు నిస్సంకోచంగా దీన్ని చేసుకోవచ్చు
  • కాలేయ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి
  • ఈ విధానంతో బరువు తగ్గడం, జీవక్రియల్లో మెరుగుదల తదితర ప్రయోజనాలు
  • ఫాస్టింగ్ ఎక్కువ అయితే ప్రతికూల ఫలితాలు

ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ చాలా ప్రచారానికి, ఆదరణకు నోచుకున్న ఆహార విధానం అని చెప్పుకోవాల్సిందే. బరువు తగ్గేందుకు, ఆరోగ్యం కోసం దీన్ని అనుసరించొచ్చని ఎంతో మంది నిపుణులు సూచిస్తున్నారు. నాణేనికి బొమ్మా, బొరుసూ ఉన్నట్టే.. ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ లో ప్రయోజనాలతోపాటు, దుష్ఫలితాలూ ఉంటాయి. అందుకే దీన్ని పాటించే ముందు ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవాలి.

రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు, రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ అనే ఆహార ప్రక్రియ మంచి ఫలితాలను ఇస్తుందని పలువురు చెబుతున్నారు. ఈ విధానంతో తాము బరువు తగ్గామని అలియా భట్, వరుణ్ ధావన్ సహా ఎంతో మంది సెలబ్రిటీలు సైతం ప్రకటించారు. ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ అంటే, ఒక నిర్ణీత సమయంలోనే ఆహారం తీసుకోవడం. ఈ వేళలు పలు రకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు 16/8 అనేది ఎక్కువ మంది అనుసరించే విధానం.

రోజులో 24 గంటలు ఉంటాయి. ఇందులో ఏ ఆహారం తీసుకున్నా కానీ 8 గంటల పరిధిలోనే తీసుకోవాలి. అక్కడి నుంచి మిగిలిన 16 గంటలు ఆహారం తీసుకోకూడదు. ఉదాహరణకు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల్లోపు ఆహారం ఎన్ని సార్లు అయినా తీసుకోవచ్చు. రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆహారానికి దూరంగా ఉండాలి. దీనివల్ల 8 గంటల కాలంలో తీసుకున్న ఆహారాన్ని మన శరీరం మిగిలిన 16 గంటల్లో పూర్తిగా ఖర్చు చేసుకుంటుంది. దాంతో మన శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం, దాని ఫలితంగా బరువు పెరగడం, ఇతర అనారోగ్యాలు ఉండవన్నది నిపుణుల వివరణ. వారంలో ఐదు రోజులు సాధారణంగా ఆహారం తీసుకుని, మిగిలిన రెండు రోజుల్లో సాధ్యమైన మేర ఆహారాన్ని నియంత్రించుకోవడం కూడా మరో విధానం. అలాగే 12/12 గంటల విధానాన్ని అనుసరించే వారూ ఉన్నారు.

ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల వల్లే ఇటీవలి కాలంలో ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ ఆదరణకు నోచుకుంటున్నట్టు ఫరీదాబాద్ లోని ఏషియన్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డైరెక్టర్ డాక్టర్ అమిత్ మిగ్లానీ చెప్పారు. బరువు తగ్గడం, జీవక్రియల్లో మెరుగుదల, మొత్తం మీద మెరుగైన ఆరోగ్యం కోసం దీన్ని అనుసరిస్తున్నట్టు తెలిపారు. ఇంటర్ మిటెంట్ వల్ల ప్రయోజనం ఎలా అన్నదాన్ని ఆయన వివరించారు. ‘‘కాలేయం కీలకమైన పనులు నిర్వహిస్తుంటుంది. వ్యర్థాలను తొలగించడం, జీవక్రియలు నిర్వహించడంతోపాటు, శక్తిని తయారు చేస్తుంటుంది. ఫాస్టింగ్ చేసినప్పుడు నిల్వ చేసుకున్న గ్లైకోజెన్ ను కాలేయం విచ్ఛిన్నం చేసి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఫాస్టింగ్ సమయంలో కీటోన్ తయారీకి కూడా కాలేయం కీలకంగా పనిచేస్తుంది. మెదడు, ఇతర శరీర అవయవాలకు కీటోన్ అనేది ప్రధాన శక్తిగా పనిచేస్తుంది. అయితే ఫాస్టింగ్ మరీ ఎక్కువ సమయం కొనసాగితే చెడు ఫలితాలు కూడా ఉంటాయి’’అని మిగ్లానీ వివరించారు.

ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ తో ఫ్యాటీ లివర్ వ్యాధి  కూడా తగ్గుతుందన్నారు. కాలేయంలో అధికంగా ఫ్యాట్ పేరుకుపోవడమే ఈ సమస్య. అధిక ఆల్కహాల్, అధిక ఫ్యాట్ పదార్థాలు తీసుకోవడం దీనికి కారణం. ఇంటర్ మిటెంట్ వల్ల ఈ ఫ్యాట్ కరుగుతుందని ఆయన చెప్పారు. జీర్ణ రసాల ఉత్పత్తి ఎక్కువ అయినప్పుడు కూడా కాలేయం దెబ్బతింటుంది. ఇంటర్ మిటెంట్ తో జీర్ణరసాల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ఈ విధంగానూ ప్రయోజనం ఉంటుంది. అయితే, అప్పటికే కాలేయ సమస్యలు ఉన్న వారికి ఈ విధానం సరిపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాలేయ సమస్యలు ఉన్నవారు ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ విధానం అనసరించడానికి లేదా ఆహారంలో మార్పులు చేసుకోవడానికి ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలని మిగ్లానీ సూచించారు.

Related posts

వివేకా హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీం ప్రశ్నలవర్షం..

Drukpadam

రమ్య తల్లిదండ్రులను క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చినహోంమంత్రి… అక్కున చేర్చుకుని ఓదార్చిన సీఎం జగన్!

Drukpadam

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ …భారీగా హాజరైన రైతుసంఘాల నేతలు…

Drukpadam

Leave a Comment