Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

నల్ల డబ్బు దాచుకునేవారికి మాత్రమే ఈ రూ.2000 నోటు ఉపయోగపడింది: చిదంబరం…

నల్ల డబ్బు దాచుకునేవారికి మాత్రమే ఈ రూ.2000 నోటు ఉపయోగపడింది: చిదంబరం…

  • 2016లో రూ.2 వేల నోటు ప్రవేశపెట్టిన కేంద్రం
  • ఏడేళ్ల తర్వాత ఉపసంహరణ
  • రూ.2 వేల నోటు తీసుకురావడం తెలివి తక్కువ చర్య అన్న చిదంబరం
  • ఇప్పటికైనా రద్దు చేసినందుకు సంతోషం అంటూ వ్యాఖ్యలు

కేంద్రం 2016లో రూ.2000 నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటును రద్దు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని రోజుల కిందట ప్రకటించింది. ఆర్బీఐ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం స్పందించారు.

రూ.2000 నోటును తీసుకురావడమే ఒక తెలివితక్కువ చర్య అని, ఇప్పుడైనా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు సంతోషం అంటూ వ్యాఖ్యానించారు. నల్ల డబ్బు దాచుకునేవారి కోసమే ఈ పెద్ద నోటు ఉపయోగపడిందని విమర్శించారు.

ప్రస్తుతం సామాన్యుల వద్ద రూ.2000 నోట్లు లేవని, రోజువారీ అవసరాలకు రూ.2 వేల నోట్లను ఉపయోగించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పెద్ద నోట్లను ఉపయోగిస్తున్నది ఎవరు? అని చిదంబరం ప్రశ్నించారు.

ఎలాంటి పత్రాలు నింపాల్సిన అవసరం లేకుండా, ఐడెంటిటీ కార్డులతో పని లేకుండా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని బ్యాంకులు చెబుతున్నాయని, ఇప్పుడు కూడా నల్ల డబ్బు దాచుకున్న వారికే ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని దీన్నిబట్టే అర్థమవుతోందని తెలిపారు. సులభంగా మార్చుకోవచ్చంటూ నల్లడబ్బు దాచుకున్నవారికి బ్యాంకులు సాదర స్వాగతం పలుకుతున్నాయని చిదంబరం విమర్శించారు.

రూ.2,000 నోటు మార్చుకునేందుకు తొందర వద్దు: ఆర్ బీఐ గవర్నర్

  • సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చామని గుర్తు చేసిన శక్తికాంతదాస్
  • మొదటి రోజే బ్యాంకులకు క్యూ కట్టాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
  • గడువు పొడిగింపుపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
No need to rush for exchange RBI Governor Shaktikanta Das on Rs 2000 note ban

రూ.2,000 నోట్లను పట్టుకుని బ్యాంకులకు పరుగుదీయాల్సిన తొందరేమీ లేదని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. సెప్టెంబర్ 30 వరకు వీటిని మార్చుకోవచ్చని, అందుకు నాలుగు నెలల సమయం ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు. రూ.2,000 నోటును ఉపసంహరించుకోవడం అన్నది కరెన్సీ నిర్వహణ కార్యకలాపాల్లో, క్లీన్ నోట్ పాలసీలో భాగమని పేర్కొన్నారు. క్లీన్ నోట్ పాలసీ అంటే.. కరెన్సీ నోట్లకు జీవిత కాలం ఉంటుంది. ముద్రించిన తర్వాత కొన్నేళ్లకు అవి చిరిగి పోతుంటాయి. దీంతో తిరిగి కొత్త నోట్లను ప్రవేశపెట్టడమే క్లీన్ నోట్ పాలసీ.

వ్యవస్థలోని దాదాపు అన్ని రూ.2,000 నోట్లు తిరిగి సెప్టెంబర్ చివరికి ఆర్ బీఐ వద్దకు వస్తాయన్నారు శక్తికాంతదాస్. వ్యవస్థలో ఇతర డినామినేషన్ నోట్లు తగినంత అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. నోట్లను డిపాజిట్ చేసేందుకు గడువు విధించడం అన్నది ప్రక్రియ క్రమబద్ధంగా సాగేందుకేనన్నారు. దీని ద్వారా తలెత్తే అంశాల పట్ల తమకు అవగాహన ఉందన్నారు.

’’ఓ గడువు అంటూ పెట్టకపోతే దానికి ముగింపు ఉండదు. ఓ సమయం అంటూ ఇచ్చినప్పుడే ప్రకటనను సీరియస్ గా తీసుకుంటారు. వేసవి మండే ఎండల్లో ప్రజలు బారులు తీరి నుంచోవాల్సిన అవస్థ లేకుండా, వేగంగా ప్రక్రియ పూర్తయ్యేందకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం. కనుక సమయం తీసుకోండి. సెప్టెంబర్ చివరి వరకు గడువు ఉంది. రేపటి నుంచి బ్యాంకులు రూ.2,000 నోట్ల మార్పిడిని అనుమతిస్తాయి. రేపే బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు’’ అని శక్తికాంత దాస్ వివరించారు.

సెప్టెంబర్ 30 తర్వాత గడువు పొడిగించే అవకాశంపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఎంతో మంది విదేశాల్లో ఉన్నారని, గడువులోపు వారు స్వదేశానికి వచ్చి రూ.2,000 నోట్లను మార్చుకోలేకపోవచ్చన్నారు. ఈ అంశాలను తాము ఏ విధంగా పరిష్కరించగలమో తర్వాత చూస్తామన్నారు.

రూ.వెయ్యి నోట్లు మళ్లీ వస్తాయా?.. ఆర్ బీఐ గవర్నర్ సమాధానమిదే!

రూ.వెయ్యి నోట్ల‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న లేద‌న్న శక్తికాంత దాస్

తమ వ‌ద్ద అలాంటి ప్ర‌తిపాద‌నేదీ లేదని వెల్లడి

రూ.2 వేల నోట్ల విత్ డ్రా వల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై పెద్దగా ప్ర‌భావం ఉండదని వ్యాఖ్య

Are rs 1000 Notes Coming Back answers RBI Governor

2016లో రూ.వెయ్యి, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. రూ.వెయ్యి నోటు స్థానంలో కొత్తగా రూ.2 వేల నోటును తీసుకురాగా, పాత రూ.500 నోటు స్థానంలో కొత్తది ప్రవేశపెట్టింది. రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రెండు రోజుల కిందట ఆర్బీఐ ప్రకటించింది. దీంతో రూ.2 వేల నోటు స్థానంలో రూ.వెయ్యి నోటును మళ్లీ తీసుకొస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ క్లారిటీ ఇచ్చారు. వెయ్యి రూపాయల నోట్ల‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న లేద‌ని స్పష్టం చేశారు. 2 వేల నోట్ల‌ను విత్ డ్రా చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రభావాన్ని త‌ట్టుకునేందుకు రూ.వెయ్యి నోట్ల‌ను ప్ర‌వేశ‌పెడుతారా? అని మీడియా ప్రశ్నించింది. ఆయన బదులిస్తూ.. ‘‘రూ.1000 నోటును మళ్లీ తీసుకోచ్చే ఆలోచ‌న లేదు. అది ఊహాజ‌నితమే. మా వ‌ద్ద అలాంటి ప్ర‌తిపాద‌నేదీ లేదు’’ అని వివరించారు.

ప్ర‌స్తుతం స‌ర్క్యులేష‌న్‌లో ఉన్న క‌రెన్సీలో.. కేవ‌లం 10.8 శాతం మాత్ర‌మే రూ.2 వేల నోట్లు ఉన్నాయని శక్తికాంతదాస్ వివరించారు. ఆ నోట్ల‌ను విత్‌డ్రా చేయ‌డం వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై అతి స్వ‌ల్ప స్థాయిలోనే ప్ర‌భావం ఉంటుంద‌ని ఆయన తెలిపారు.

Related posts

ఒడిశా రైలు ప్రమాదం: పేరెంట్స్‌తో డిన్నర్ ప్లాన్ 16 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడింది!

Drukpadam

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు… ఏబీసీ సీ ఓటర్ సర్వే వివరాలు ఇవిగో!

Ram Narayana

ఎంఎస్ ధోనీపై పరువునష్టం కేసు నమోదు.. రేపు విచారణ

Ram Narayana

Leave a Comment