Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ పార్టీ మరోసారి అల్టిమేటం..!

మీరుంటే మేం ఉండం!.. కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ పార్టీ మరోసారి అల్టిమేటం..!

  • ఢిల్లీ ఆర్డినెన్స్ ను బహిరంగంగా, రాజ్యసభలో కాంగ్రెస్ వ్యతిరేకించాలన్న ఆప్ 
  • ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ మౌనం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్య
  • ఆర్డినెన్స్‌ను అందరూ వ్యతిరేకించినా కాంగ్రెస్ కలిసి రావడం లేదన్న ఆమ్ ఆద్మీ

కేంద్రం తీసుకువచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తమతో జతకలవాలని అప్పుడే తాము విపక్ష కూటమి సమావేశంలో కలుస్తామని హెచ్చరికలు జారీ చేసిన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు ప్రతిపక్ష సమావేశంలో పాలుపంచుకుంది. అయితే కాంగ్రెస్ కు మరోసారి అల్టిమేటం జారీ చేసింది. ఈ బ్లాక్ ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ తిప్పికొట్టాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే విపక్షాల కూటమి సమావేశాలలో తాము పాలుపంచుకునేది లేదని తేల్చి చెప్పింది.

ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో విపక్ష కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య చిచ్చు రాజుకుంది. పాట్నాలో జరిగిన సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ… కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్లాక్ ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిందేనని, లేదంటే ఆ పార్టీ ఉండే కూటమిలో తాము ఉండేది లేదని తేల్చి చెప్పింది.

జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ ఎన్నో అంశాలపై నిర్ణయం తీసుకుందని, కానీ ఢిల్లీ ఆర్డినెన్స్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ మౌనం అనుమానాలకు తావిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రకటనలో తెలిపింది.

కాంగ్రెస్ బహిరంగంగా ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని, అలాగే 31 మంది ఎంపీలు ఉన్నందున రాజ్యసభలో దీనిని తిప్పికొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ విజ్ఞప్తి చేసింది. లేదంటే కాంగ్రెస్ పాల్గొనే సమావేశాల్లో తాము పాలుపంచుకోమని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ మినహా ఈ రోజు పాల్గొన్న మిగతా 11 పార్టీలు ఆర్డినెన్స్ విషయంలో తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పింది.
ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ రాజ్యసభలో ఓటింగ్ కు గైర్హాజరు కావాలని భావిస్తోందని, కానీ అలా చేస్తే బీజేపీకి లబ్ధి చేకూరుతుందని తెలిపింది.

ఆర్డినెన్స్ ను వ్యతిరేకించడం లేదా సమర్థించడం పార్లమెంటు లోపల ఉంటుందని, సమావేశాలు ప్రారంభమైనప్పుడు దాని గురించి అన్ని పార్టీలు కలిసి చర్చిస్తాయని, కానీ ఇప్పుడు ఇలాంటి పబ్లిసిటీ ఎందుకని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. 18 – 20 పార్టీలు కలిసి దేనిని వ్యతిరేకించాలని, దేనిని సమర్థించాలనే అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకుంటాయన్నారు.

Related posts

నాకు సీఎం కావాలని ఉంది…శరద్ పవార్ ను పార్టీ నుంచి తొలగించాం ..అజిత్!

Drukpadam

మాజీ సీఎం యడియూరప్పకు బీజేపీ షాక్..

Drukpadam

కొత్త గుర్తు తీసుకోండి …ఉద్ధవ్ థాకరేకి శరద్ పవార్ కీలక సూచన!

Drukpadam

Leave a Comment