ఓ సైకో మంత్రి సభను అడ్డుకునే ప్రయత్నాలు చేశాడు: రేవంత్ రెడ్డి !
- గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించిందన్న రేవంత్ రెడ్డి
- తెలంగాణలో పర్యటించే అర్హత రాహుల్ గాంధీకి కాకుండా ఇంకెవరికి ఉందని ప్రశ్న
- కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగు అని వ్యాఖ్యానించిన టీపీసీసీ చీఫ్
దేశంకోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి తెలంగాణలో పర్యటించే అర్హత లేదనడం బీఆర్ఎస్ అవివేకమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన సభను అడ్డుకోవడానికి ఓ సైకో మంత్రి ప్రయత్నాలు చేశాడన్నారు. రేవంత్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగం చేసిందన్నారు. బీఆర్ఎస్ నేతల్లా అవినీతి చేయలేదన్నారు. పదేళ్లు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ పదవి తీసుకోలేదన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రధాని పదవినే త్యాగం చేసిందన్నారు.
రాహుల్ గాంధీ కంటే ఇంకెవరికైనా తెలంగాణలో పర్యటించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. రాహుల్ గురించి మాట్లాడే అర్హతే బీఆర్ఎస్ కు లేదన్నారు. ఉపాధిహామీ చట్టం, ఆర్టీఐ, ఆహార భద్రత చట్టంతో పాటు ఓఆఆర్, విమానాశ్రయం, ఫార్మా సంస్థలను కాంగ్రెస్ పార్టీయే తీసుకువచ్చిందన్నారు. తెలంగాణ వచ్చాక ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం ఆస్తులు అమాంతం పెరిగాయని ఆరోపించారు. 2014 జూన్ 2న కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎంత? 2023 జులై 2 నాటికి వారి కుటుంబం ఆస్తులు ఎంత? దీనిపై చర్చించేందుకు వారు సిద్ధమా? అని సవాల్ చేశారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రూపొందిస్తే, కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని, కానీ రీడిజైన్ తర్వాత ఆయకట్టు ప్రాంతం ఏమాత్రం పెరగలేదన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర వనరులను కరిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగు అని, దానికి ఎంత ఖర్చు చేసినా సరిపోవడం లేదన్నారు. ఈ మాట తాను అనడం లేదని, కాగ్ నివేదిక పేర్కొందని తెలిపారు. ఈ నివేదికపై చర్చించేందుకు కేటీఆర్, హరీశ్ రావులు సిద్ధమా? అని సవాల్ విసిరారు.