- INDIA పేరిట కూటమిగా ఏర్పడిన విపక్షాలు
- ఇండియా అనే పదం వలసపాలన అవశేషం అన్న బీజేపీ ఎంపీ
- వేల సంవత్సరాలుగా భారత్ అనే పేరు ఉందని వెల్లడి
బీజేపీ ఎంపీ నరేశ్ బన్సాల్ తన వ్యాఖ్యలతో రాజ్యసభలో కలకలం రేపారు. భారత రాజ్యాంగం నుంచి ఇండియా అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇండియా అనే పదం వలస పాలన బానిసత్వానికి ప్రతీక అని నరేశ్ బన్సాల్ అభివర్ణించారు. ఇటీవల విపక్షాలు బెంగళూరులో సమావేశమై INDIA అనే కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో, బన్సాల్ విమర్శనాత్మకంగా పైవ్యాఖ్యలు చేశారు. ఇండియా అనే పదం వలస పాలన అవశేషం అని పేర్కొన్నారు.
భారత్ అనే పదాన్ని ఇండియాగా బ్రిటీష్ వారు మార్చారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో అలాగే పేర్కొన్నారని బన్సాల్ వివరించారు. వేల సంవత్సరాలుగా భారత్ అనే పేరు ఉందని, బ్రిటీషర్లు వచ్చాకే ఇండియా అనే పదం ఉత్పన్నమైందని తెలిపారు. సంస్కృత గ్రంథాల్లోనూ భారత్ ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. ఇక ఎంతమాత్రం ఇండియా అనే పదం రాజ్యాంగంలో ఉండరాదని అన్నారు.