- ఓఆర్ఆర్ అమ్ముకోవడానికి.. దళితుల భూములు లాక్కోవడానికి తెలంగాణ ఇవ్వలేదన్న పీసీసీ చీఫ్
- వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 25 సీట్లు కూడా రావని జోస్యం
- దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారని వ్యాఖ్య
- తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ వైన్స్ టెండర్లు వేస్తామని స్పష్టీకరణ
తెలంగాణలో ప్రభుత్వ భూములు వేలం వేస్తోన్న నేపథ్యంలో వాటిని కొనుగోలు చేస్తున్న వారికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది ఔటర్ రింగ్ రోడ్డులు అమ్ముకోవడానికి, దళితుల భూములు లాక్కోవడానికి కాదన్నారు. వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కొన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో భూముల విక్రయం ద్వారా ఆర్జిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని పలు సర్వేలు చెబుతున్నాయని, ఆ పార్టీకి కనీసం 25 సీట్లు కూడా రావని, ఈ కారణంగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశ్యంతో భూములను అమ్మి వాటి ద్వారా వచ్చే సొమ్మును మూటగట్టి విదేశాలకు పారిపోవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. సొంత మనుషులకు ఇచ్చుకోవడానికే ముందుగా వైన్స్ టెండర్లు వేస్తున్నారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ టెండర్లు వేస్తామని స్పష్టం చేశారు.