దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ బిల్డింగ్.. !
-త్రీడీ పోస్టాఫీసును ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
-కేవలం 45 రోజుల్లోనే పూర్తయిన వెయ్యి చదరపు అడుగుల బిల్డింగ్
-బెంగళూరులోని హాలాసూర్ లో ప్రారంభోత్సవం
దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ బిల్డింగ్ ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ప్రారంభించారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో బెంగళూరులో ప్రింట్ చేసిన ఈ బిల్డింగ్ ను కేవలం 45 రోజుల్లో పూర్తిచేసినట్లు మంత్రి తెలిపారు. నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. బెంగళూరులోని హాలాసూర్ కేంబ్రిడ్జి లే అవుట్ లో దాదాపు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ త్రీడీ బిల్డింగ్ ను రూపొందించారు. ఎల్ అండ్ టీ కంపెనీ 3డి కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణాన్ని పూర్తిచేసింది.
బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని చేపడుతున్న అభివృద్ధి పనులకు ఈ బిల్డింగ్ ఒక నిదర్శనమని చెప్పారు. దేశానికి కొత్తదనాన్ని పరిచయం చేయడంలో బెంగళూరు ముందు ఉంటుందని, త్రీడీ పోస్టాఫీసు బిల్డింగ్ తో దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. యావత్ దేశం ఇదే స్ఫూర్తితో పురోగమిస్తోందని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లో తాము ప్రతిపాదించిన త్రీడీ బిల్డింగ్ ప్లాన్ కు బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ (బీఎంటీపీసీ) ఆమోదం తెలపగా.. ఐఐటీ మద్రాస్ సహకారంతో పూర్తిచేసినట్లు ఎల్ అండ్ టి కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.