- ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రి బుగ్గన సమీక్ష
- కర్నూలులో హైకోర్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడి
- జగన్నాథ గట్టుపై జ్యుడిషియల్ సిటీ, లా యూనివర్సిటీ నిర్మాణం చేపడతామని స్పష్టీకరణ
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల అభివృద్ధిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనుమతులు వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు నిర్మిస్తామని తెలిపారు. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.
ఆ లోపు జగన్నాథ గట్టుపై జ్యుడిషియల్ సిటీ, జాతీయ లా యూనివర్సిటీకి సీఎం జగన్ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రూ.140 కోట్లతో సిల్వర్ జూబ్లీ కాలేజీ నిర్మాణం జరపనున్నట్టు పేర్కొన్నారు.
ఇక, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో ఆదాయం 6 శాతం కాగా, జగన్ పాలనలో ఆదాయం 21 శాతం అని వివరించారు. ప్రజలు చంద్రబాబు, జగన్ పాలనలో తేడా గమనించాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశానికి కర్నూలు జిల్లా కలెక్టర్ జి.సృజన, కర్నూలు శాసనసభ్యుడు హఫీజ్ ఖాన్, అధికారులు హాజరయ్యారు.