- ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ‘డుబియన్’కు ప్రచారకర్తగా సచిన్
- మానుకోవాలంటూ ప్రహార్ జన్‌శక్తి ఎమ్మెల్యే నిరసన
- బ్యాటింగ్ టు బెట్టింగ్ అంటూ నినాదాలు
- ఎమ్మెల్యే సహా 22 మందిపై కేసుల నమోదు
ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ను ఎండార్స్ చేస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు లీగల్ నోటీసులు పంపుతామని రెండు రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చిన ప్రహార్ జన్‌శక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చు కాడూ.. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిన్న ముంబైలోని సచిన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కోట్లాదిమంది యువతకు స్ఫూర్తి అయిన, భారత అత్యున్నత పౌరపురస్కారం అందుకున్న సచిన్ టెండూల్కర్ గేమింగ్ యాప్ ‘డుబియస్’ను ప్రమోట్ చేయడం సరికాదంటూ మాజీ మంత్రి అయిన కాడూ బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో నిన్న సచిన్ ఇంటి వద్దకు చేరుకున్న కాడూ.. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘బ్యాటింగ్ టు బెట్టింగ్’ అని నినదించారు. భారతరత్న పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. యువత జీవితాలను నాశనం చేసే ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలు వడ్డీలకు డబ్బులు తీసుకుని మరీ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు.
ఆన్‌లైన్ గేమ్‌ను ఎండార్స్ చేస్తున్న సచిన్.. లోకల్ గేమ్ అయిన మట్కాను ఎందుకు వదిలేశారని ఎద్దేవా చేశారు. భగత్‌సింగ్, అన్నాభౌ సాఠే, మహాత్మా జ్యోతిబా ఫూలె భారతరత్న అందుకోలేదని, దానిని అందుకున్న వారు మాత్రం ఇలాంటి ఎండార్స్‌మెంట్ల నుంచి లాభం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనల నుంచి సచిన్ వైదొలగకుంటే ప్రతి గణేశ్ మండపం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే బచ్చూ కాడూ సహా కార్యకర్తలను సచిన్ ఇంటి నుంచి తరలించిన పోలీసులు ఎమ్మెల్యే సహా 22 మందిపై కేసు నమోదు చేశారు.