Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

సనాతన ధర్మంపై ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. అమిత్ షా మండిపాటు

  • రాజస్థాన్‌లో నేడు దుంగార్‌పూర్‌లో పరివర్తన్ ర్యాలీ ప్రారంభించిన హోం మంత్రి అమిత్ షా
  • ప్రజలను ఉద్దేశించి ప్రసంగం, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందన
  • ప్రతిపక్ష ఇండియా కూటమి భారత సంస్కృతిని అవమానిస్తోందని మండిపాటు
  • ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందంటూ విమర్శలు 

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి హిందూ మతాన్ని ద్వేషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలను భారత సంస్కృతిపై దాడిగా అభివర్ణించారు. రాజస్థాన్‌‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హోం మంత్రి దుంగార్‌పూర్‌లో బీజేపీ పరివర్తన్ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాజస్థాన్ ప్రభుత్వం, ప్రతిపక్ష ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. ఆ కూటమివి ఓటు బ్యాంకు రాజకీయాలని, బుజ్జగింపు వ్యూహాలని ఎద్దేవా చేశారు.  

‘‘గత రెండు రోజులుగా ఇండియా కూటమి నేతలు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారు. కాంగ్రెస్, డీఎంకే పార్టీల్లో కీలక నేతల కుమారులు సనాతన ధర్మాన్ని అంతమొందించాలని పిలుపునిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. గతంలో ఓ మారు రాహుల్ గాంధీ హిందూ సంస్థలు లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థ కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అప్పటి హోం మంత్రి సుశీల్ కుమార్ శిండే దేశంలో హిందూ ఉగ్రవాదం ఉందని ఆరోపించారు. మోదీ గెలిస్తే దేశంలో సనాతన పాలన వస్తుందని వాళ్లు అంటున్నారు. సనాతన పాలన అంటే ప్రజల మనసులపై పాలనే. దేశ పాలన రాజ్యాంగబద్ధంగా ఉంటుందని మోదీ ఏప్పుడో చెప్పారు’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. 

నేడు ప్రారంభమైన బీజేపీ పరివర్తన్ యాత్ర 19 రోజుల పాటు 2,500 కిలోమీటర్ల మేర సాగుతుందని చెప్పారు. 52 నియోజక వర్గాల మీదుగా సాగే ఈ యాత్రలో 156 చిన్న, 54 భారీ బహిరంగ సభలు జరుగుతాయన్నారు. యాత్ర ముగిసే సమయానికి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ భవితవ్యం తెలిసిపోతుందని కూడా వ్యాఖ్యానించారు.

Related posts

సీట్లు తగ్గినా తగ్గని మోడీ గాంబీర్యం …

Ram Narayana

ఓట్ల కోసం ముస్లింలను తిట్టడమే మోదీ పని: అసదుద్దీన్ ఓవైసి ఆరోపణ

Ram Narayana

లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు బీజేపీకి షాక్‌.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న‌ మాజీ సీఏం

Ram Narayana

Leave a Comment