- 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్
- జీ20 దేశాధినేతలకు విందు ఇవ్వనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొన్న వైనం
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. మన దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగబోతున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో జీ20 దేశాధినేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా విందు కోసం రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికలను పంపించింది. అయితే ఈ ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమయింది.
మరోవైపు ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల అజెండా ఏమిటనేది ఇంతవరకు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో… ఇండియా పేరును భారత్ గా మార్చేందుకే ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. విపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కూటమిపై బీజేపీ నిప్పులు చెరిగింది. దేశం పేరు ఎలా పెట్టుకుంటారంటూ బీజపీ నేతలు మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక పెను దుమారానికి దారి తీసింది.
ఇండియా పేరును భారత్ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నా: వీరేంద్ర సెహ్వాగ్

ఇండియా పేరును భారత్ గా కేంద్ర ప్రభుత్వం మార్చబోతోందనే ప్రచారం ఊపందుకుంది. జీ20 దేశాధినేతలకు ఈ నెల 9న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా… ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. దీంతో, మన దేశం పేరును మార్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
ఇక ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరు మార్పుకు సంబంధించిన బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశం పేరును భారత్ గా మార్చడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు.
‘పేరు అనేది మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. మనం భారతీయులం. ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు ఇచ్చిన పేరు. మన దేశం అసలైన పేరు భారత్ ను అధికారికంగా తిరిగి పొందడానికి ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. వన్డే ప్రపంచకప్ లో మన ప్లేయర్ల జెర్సీలపై కూడా భారత్ అని ఉండాలని బీసీసీఐను, జైషాను కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు.
మన దేశం భారత్.. అప్పుడు, ఎప్పుడూ అదే పేరు ఉంటుంది: కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్

జీ20 విందుకు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వానపత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాల వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతి విషయంలో సమస్యలు కనిపిస్తాయని విమర్శలు గుప్పించారు. దేశం ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌గానే ఉంటుందన్నారు.
కాంగ్రెస్ నేతలకు తాను ఏమీ చెప్పదలుచుకోలేదన్నారు. తాను భారత్‌వాసినని, తన దేశం పేరు ఎప్పటికీ భారత్‌గానే ఉంటుందన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి ఆ పార్టీ చికిత్స తీసుకోవాలన్నారు.
సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పేరు మార్పు ప్రతిపాదనను సభ్యుల ముందు ఉంచనుందని భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్‌గా మార్చే ప్రక్రియను కేంద్రం చేపడుతుందని, ఈ పేరు మార్చుతూ సభలో తీర్మానం ఆమోదించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలుస్తోంది.
దేశం పేరును మార్చే హక్కు ఎవరికీ లేదు: శరద్ పవార్
- దేశం పేరుపై బీజేపీ ఎందుకు కలవరపడుతుందో అర్థం కావడం లేదన్న పవార్
- పేరు మార్పు విషయమై తనకు సమాచారం లేదని వెల్లడి
- మరాఠా రిజర్వేషన్లపై కూడా స్పందించిన ఎన్సీపీ అధినేత

జీ-20 విందు కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటం, కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇండియా పేరును భారత్‌గా మార్చనుందనే ఊహాగానాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. దేశం పేరును మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ… దేశానికి సంబంధించిన పేరుపై అధికార పార్టీ ఎందుకు కలవరపడుతోందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే ఇండియాను భారత్‌గా మారుస్తారా? అనే విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ‘ఇండియా’ కూటమిలోని పార్టీల అధినేతలతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే బుధవారం నిర్వహిస్తున్న సమావేశంలో దీనిపై చర్చిస్తామని శరద్ పవార్ చెప్పారు.
శరద్ పవార్ అంతకుముందు మరాఠా రిజర్వేషన్ల అంశంపై కూడా మాట్లాడారు. రిజర్వేషన్లలో తమకు ప్రత్యేక కోటా కేటాయించాలని మరాఠాలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో పవార్ మాట్లాడుతూ… ఇప్పటి వరకు ఉన్న 50 శాతం కోటా పరిమితిని ఎత్తివేయాలన్నారు. ఇతర వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లను సమకూర్చాలంటే ఇప్పుడున్న దానికి అదనంగా 15 నుండి 16 శాతం పెంచాలన్నారు. మరాఠా కోటాపై జరుగుతోన్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో పవార్ ఈవ్యాఖ్యలు చేశారు.