- సెంట్రింగ్ కర్రలు విరగడంతో ఆరో అంతస్తు నుంచి కిందపడ్డ కూలీలు
- తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం
- మరో ఇద్దరు కూలీల పరిస్థితి విషమం
హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. సెంట్రింగ్ కోసం పెట్టిన కర్రలు విరిగిపోవడంతో పలువురు కూలీలు ఆరో అంతస్తు నుంచి కిందపడ్డారు. దీంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కేపీహెచ్ బీ కాలనీలోని అడ్డగుట్టలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారు బీహార్ కు చెందిన సంతు బట్నాయక్, సోనియా చరణ్ లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ముగ్గురు కూలీలను ఆసుపత్రికి తరలించామని, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారన్నారు. కాగా, భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవన నిర్మాణంలో భాగంగా జీ 4 కు అనుమతులు తీసుకుని, జీ 5 నిర్మిస్తున్నట్లు సమాచారం.