- నిజ్జర్ హత్యపై పూర్తి, న్యాయమైన విచారణ జరగాలని అమెరికా భావిస్తోందన్న మాథ్యూ మిల్లర్
- భారత్ కూడా సహకరించాలన్న అమెరికా ప్రతినిధి
- అమెరికాకు భారత్ కీలక భాగస్వామిగా ఉందని వ్యాఖ్య
బ్రిటిష్ కొలంబియాలో వేర్పాటువాద ఖలిస్థాన్ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో కెనడా చేసిన ఆరోపణలపై పూర్తి, న్యాయబద్ధమైన దర్యాఫ్తు జరగాలని అమెరికా పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ… భారత్ పై చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి, న్యాయమైన విచారణ జరగాలని తాము భావిస్తున్నామన్నారు.
కెనడా ఆ విధంగా ముందుకు వెళ్లడానికి కట్టుబడి ఉన్నట్లుగా చెప్పిందని, భారత ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు ముగిసిన అనంతరం కెనడా, భారత్ మధ్య వివాదంపై ఓ ప్రశ్నకు మాథ్యూ మిల్లర్ సమాధానమిచ్చారు. కెనడాలోని పరిస్థితులపై తాము ఆందోళన చెందుతున్నామని, దీనిని తాము పరిశీలిస్తున్నామని, అదే సమయంలో దర్యాఫ్తుకు సహకరించాలని భారత్‌ను కోరామని చెప్పారు. అమెరికాకు భారత్ కీలక భాగస్వామిగా ఉందన్నారు.