- మోంటానాలోని కాలిస్పెల్ నగరంలో వెలుగు చూసిన ఘటన
- వృద్ధురాలి కంప్యూటర్ హ్యాక్ చేసి భయపెట్టిన నిందితులు
- భద్రత కోసం తన అకౌంట్లోని డబ్బును కేంద్ర బ్యాంకుకు మార్చాలని చెప్పిన వైనం
- నిందితుల మాటలు నమ్మి డబ్బు మొత్తం డ్రా చేసి వారి చేతుల్లో పెట్టిన బాధితురాలు
- మహిళ సాయంతో వలపన్ని మరీ నిందితులను పట్టుకున్న ఎఫ్‌బీఐ
అమెరికాలో ఓ వృద్ధురాలి కంప్యూటర్‌ను హ్యాక్ చేసి 1.5 లక్షల డాలర్లు (సుమారు రూ.1.2 కోట్లు) దొంగిలించిన కేసులో భారత సంతతి నిందితుడు సుఖ్‌దేవ్ వైద్ తాజాగా తాను నేరం చేసినట్టు అంగీకరించాడు. అతడికి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం, మోంటానా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. కాలిస్పెల్ నగరానికి చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు ఫిబ్రవరిలో హ్యాకింగ్ బారిన పడి 1.5 లక్షల డాలర్లు కోల్పోయింది. ఓ రోజు ఆమె కంప్యూటర్ హ్యాకైనట్టు స్క్రీన్‌పై మెసేజ్ కనిపించింది. అంతేకాకుండా, వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కు కాల్ చేయాలని కూడా ఉంది.
ఇది చూసి కంగారు పడ్డ మహిళ వెంటనే ఆ నెంబర్‌కు ఫోన్ చేసింది. ఈ క్రమంలో నిందితుడు మహిళను తన అకౌంట్లోని డబ్బును విత్‌డ్రా చేసుకుని ఫెడ్ అకౌంట్‌కు భద్రత కోసం మార్చాలని సూచించారు. ఈ క్రమంలో ఆమె నగదు విత్‌డ్రా చేసుకుని నిందితుల చేతుల్లో పెట్టింది. ఆ తరువాత తాను మోసపోయానన్న విషయం గ్రహించి తల్లడిల్లిపోయింది. అనంతరం, రంగంలోకి దిగిన ఫెడరల్ అధికారులు నిందితుల కోసం ఉచ్చు పన్నారు. మార్చిలో వారు మహిళతో నిందితులకు ఫోన్ చేయంచి తన అకౌంట్లో మరో 50 వేల డాలర్లు మిగిలిపోయాయని, వచ్చి తీసుకెళ్లమని చెప్పించారు. దీంతో, వైద్, తన సహ నిందితుడు ఎడ్లీ జోసెఫ్‌తో డబ్బు తీసుకునేందుకు రాగా పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అల్ట్రా వ్యువర్ సాయంతో నిందితులు బాధితురాలి అకౌంట్‌ను తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న వైద్‌కు వచ్చే ఏడాది శిక్ష ఖరారు కానుంది.