- బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణమన్న సజ్జనార్
- స్థానికత గుర్తింపు కార్డు చూపించి బస్సులో ప్రయాణించవచ్చునని వెల్లడి
- మార్గదర్శకాలు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
రేపు అంటే శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలకు ముందు మహిళలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి దీనిని అమలులోకి తేనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్థానికత గుర్తింపు కార్డు చూపించి బస్సులో ప్రయాణం చేయవచ్చునని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రజా రవాణా చారిత్రాత్మక నిర్ణయమని, ఈ పథకం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఇది మహిళా సాధికారతకు దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. కరోనా తర్వాత ప్రయివేటు వాహనాల సంఖ్య పెరిగిందని, దీంతో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. పెరుగుతున్న ప్రయివేటు వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతోందని, ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు రక్షణ ఉంటుందన్నారు.
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. మహిళలకు ప్రయాణం సమయంలో జీరో టిక్కెట్ ఇస్తామన్నారు. ఐదారు రోజుల తర్వాత జీరో టిక్కెట్ ప్రింటింగ్ చేస్తామన్నారు. కొన్ని రోజుల సమీక్ష అనంతరం బస్సులు పెంచడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామన్నారు.