- ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
- రాజకీయాల నుంచి విరమించుకునే ఆలోచనలో ఉన్నారన్న రామిరెడ్డి
- రాజకీయ సమీకణాల వల్లే ఆయనకు మంత్రి పదవి రాలేదని వ్యాఖ్య
ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఆర్కేకు పార్టీ నాయకత్వం అన్యాయం చేసిందని ఆయన అనుచరులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందిస్తూ… పూర్తి వ్యక్తిగత కారణాలతో ఆర్కే రాజీనామా చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కు ఆర్కే అత్యంత సన్నిహితుడని, రానున్న రోజుల్లో కూడా ఆయనతోనే నడుస్తాడని చెప్పారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా మంగళగిరి నియోజకవర్గాన్ని ఆర్కే ఎంతో అభివృద్ధి చేశారని రామిరెడ్డి కితాబునిచ్చారు. ఆర్కేకు అంచనాలు ఎక్కువగా ఉన్నాయని… వాటిని అందుకోలేననే భావనతోనే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నారని చెప్పారు. రాజకీయాల నుంచి విరమించుకునే ఆలోచనలో ఆయన ఉన్నారని తెలిపారు. అన్నీ ఆలోచించుకున్న తర్వాతే ఆయన రాజీనామా చేసి ఉండొచ్చని చెప్పారు.
మంగళగిరి టికెట్ ను బీసీలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిన తర్వాత కూడా… నియోజకవర్గంలో పార్టీ కేడర్ ను ఆర్కే బలపరిచారని రామిరెడ్డి తెలిపారు. రాజకీయ సమీకరణాల వల్లే ఆర్కేకు మంత్రి పదవి దక్కలేదని చెప్పారు. పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేశా… ఇక చాలు అనే భావనలో ఆయన ఉన్నారని తెలిపారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపై స్పీకర్ తమ్మినేని ఏమన్నారంటే..!
- ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకుంటానన్న తమ్మినేని
- రాజీనామాను ఆమోదించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని వ్యాఖ్య
Listen to the audio version of this article
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం కలకలం రేపింది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఓఎస్డీకి తన రాజీనామా లేఖను ఆర్కే స్వయంగా అందజేశారు.
రాజీనామాపై తమ్మినేని స్పందిస్తూ… ఆర్కేతో స్వయంగా మాట్లాడి రాజీనామా ఎందుకు చేశారో తెలుసుకుంటానని ఆయన తెలిపారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలియదని చెప్పారు. రాజీనామాను ఆమోదించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని చెప్పారు.
మరోవైపు, రాజీనామా చేసిన అనంతరం ఆర్కే ఎవరికీ అందుబాటులో లేరని తెలుస్తోంది. తన ఫోన్ ను ఆయన స్విచ్చాఫ్ చేసుకున్నారని చెపుతున్నారు. ఇంకోవైపు, మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీగా గంజి చిరంజీవిని జగన్ నియమించారు.