- ఇటీవల శాంసంగ్ ఫోన్లలో లోపాలను గుర్తించిన సీఈఆర్టీ-ఇన్
- తాజాగా ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఆపిల్ టీవీ ఓఎస్ లో లోపాలు
- ఆపిల్ యూజర్లను అప్రమత్తం చేసిన సీఈఆర్టీ-ఇన్
- వెంటనే ఓఎస్ ను లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలని సూచన
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఇన్) ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఆపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఆపిల్ టీవీ ఓఎస్, సఫారీ బ్రౌజర్ లో భద్రతా లోపాలు ఉన్నట్టు గుర్తించింది.
ఇటీవల శాంసంగ్ ఫోన్లలోనూ ఇదే తరహా సెక్యూరిటీ లోపాలను గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేసిన సీఈఆర్టీ-ఇన్… తాజాగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులపై దృష్టి సారించింది. ఆపిల్ ఉత్పత్తుల్లోని లోపాలను హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకుని, కీలక సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని సీఈఆర్టీ-ఇన్ భావిస్తోంది. ఈ లోపాల కారణంగా ఆయా ఉత్పత్తులోని సెక్యూరిటీ ఫీచర్లను హ్యాకర్లు అధిగమించడం సులభంగా మారుతుందని వివరించింది.
ఐఫోన్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ కు సంబంధించి 17.2, 16.7.3 కంటే ముందు వెర్షన్లు… మ్యాక్ బుక్ ఓఎస్ సోనోమా 14.2, వెంటురా 13.6.3… మానిటరీ 12.7.2 కంటే ముందు వెర్షన్లు… ఆపిల్ టీవీ ఓఎస్ 17.2, ఆపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ బ్రౌజర్ లో 17.2 కంటే ముందు వెర్షన్లలో భద్రతా లోపాలు ఉన్నాయని… యూజర్లు లేటెస్ట్ వెర్షన్లతో తమ ఓఎస్ లను అప్ డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ-ఇన్ స్పష్టం చేసింది.