Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

గుర్తింపు లేని పార్టీకి ఎలా అనుమతిచ్చారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగాం: విజయసాయిరెడ్డి

  • విజయవాడలో నేడు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం
  • వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి హాజరు
  • టీడీపీ భాగస్వామ్య పక్షంగా జనసేన హాజరైందన్న విజయసాయి
  • ఇప్పటివరకు జనసేనను బీజేపీ పార్టనర్ గా భావించారని వెల్లడి
  • ఇప్పుడా పార్టీ ఎవరి భాగస్వామ్య పక్షం? అంటూ ప్రశ్న

కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి వైసీపీ తరఫున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. సీఈసీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుర్తింపులేని జనసేన పార్టీకి ఎలా అనుమతిచ్చారన్న విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లామని విజయసాయిరెడ్డి తెలిపారు. 

“జనసేనను ఇప్పటివరకు బీజేపీ భాగస్వామ్య పార్టీగా పరిగణిస్తూ వచ్చారు. నిన్న ఎన్నికల సంఘానికి ఇచ్చిన అభ్యర్థనలో జనసేన పార్టీని టీడీపీ భాగస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు. నిజంగా ఆలోచిస్తే… జనసేన పార్టీ ఇవాళ బీజేపీ భాగస్వామ్య పక్షమా, టీడీపీ భాగస్వామ్య పక్షమా… ఆ పార్టీకి ఎలా అనుమతి ఇచ్చారన్న అంశాన్ని సీఈసీకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అనే విషయాన్ని సీఈసీ ఎదుట ప్రస్తావించాం. 

జనసేన అనేది ఒక గుర్తింపులేని రాజకీయ పార్టీ. గ్లాసు గుర్తు అనేది జనరల్ సింబల్. 175 స్థానాల్లో కేవలం కొన్ని స్థానాల్లోనే పోటీ చేసే ఒక పార్టీకి సాధారణ గుర్తుల్లోంచి ఒక సింబల్ కేటాయించడం చట్ట విరుద్ధమని కూడా మేం వివరించాం” అని విజయసాయిరెడ్డి తెలిపారు.

దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసేందుకు వెళుతూ దొంగ ఓటరును వెంట తీసుకెళ్లారు: ఏపీ మంత్రి అంబటి

Ambati slams Chandrababu

కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఏపీలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని సీఈసీకి ఫిర్యాదు చేశారు. వారివెంట తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

“మాజీ ముఖ్యమంత్రి, శాసనసభకు రానటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి కొన్ని విషయాలు  వివరించారు. ఆ సమావేశం అనంతరం వారు బయటికి వచ్చి వైసీపీని విమర్శిస్తూ మాట్లాడారు. మేం (వైసీపీ) అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నామని, దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నామని ఆరోపణలు చేశారు. 

చాలా చిత్రమైన విషయం ఏమిటంటే… చంద్రబాబు ఈ సమావేశానికి… ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని మోసం చేసి, డబ్బు తీసుకుని టీడీపీకి ఓటేసిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని వెంటబెట్టుకుని వెళ్లారు. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటరును వెంటబెట్టుకుని వెళ్లారు. ఇది ఎంత దుర్మార్గమో నాకు అర్థం కావడంలేదు. 

వైసీపీలో ఫ్యాన్ గుర్తుపై గెలిచి, మొన్న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో టీడీపీకి అమ్ముడుపోయి, చంద్రబాబు చెప్పిన మేరకు టీడీపీకి ఓటేసిన శ్రీదేవి వంటి వారిని వెంటబెట్టుకుని వెళ్లి మాపైనే ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు.

ఇంకా నయం… మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, ఆనం రామనారాయణరెడ్డిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా వెంటబెట్టుకుని వెళ్లుంటే బండారం బాగా బయటపడేది. నేను ఒకటే చెబుతున్నా… ఈ దేశంలో ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకంలేని నేత ఉన్నారంటే అది నూటికి నూరు శాతం చంద్రబాబే. ఆయనకు డబ్బు మీద, కుట్రలు, కుతంత్రాల మీద నమ్మకం ఉంటుంది. ఇవి చేస్తూ ఇంతవరకు ఎదిగిన వ్యక్తి చంద్రబాబు… ఆయన ప్రజాదరణతో ఎదిగిన వ్యక్తి కానే కాదు” అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

Related posts

పూతలపట్టు సభలో సీఎం జగన్ కు పాదాభివందనం చేసిన మంత్రి రోజా

Ram Narayana

జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన భూమా అఖిలప్రియ అరెస్ట్

Ram Narayana

వేమిరెడ్డి రూ. 1000 కోట్లు.. నారాయణ రూ. 500 కోట్లు ఖర్చుపెడతారట: విజయసాయిరెడ్డి

Ram Narayana

Leave a Comment