- ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దని హితవు
- ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని సూచన
- ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని వ్యాఖ్య
ఏ ప్రభుత్వమైనా ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోకూడదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఉందన్నారు.
ఆటో కార్మికులకు ప్రతి నెల రూ.15వేలు భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పొట్ట కొట్టారంటూ ఆటో డ్రైవర్లు ధర్నాలు… నిరసనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా వారికి తగిన న్యాయం చేయాలని సూచించారు. పండుగ సమయంలో ఆటోవాలాల జీవితంలో సంబరం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ బాధలు గట్టెక్కుతాయని భావించారని… కానీ రోడ్డున పడ్డారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమేనని… కానీ బస్సులు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం పెంచాలన్నారు.