- ఏఐజీ ఆసుపత్రిలో వీరభద్రంను పరామర్శించిన రాఘవులు
- ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగుపడుతోందని వెల్లడి
- మరో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారని వ్యాఖ్య
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేగంగా కోలుకుంటున్నారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేనిని బుధవారం ఆయన పరామర్శించారు.
అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ… తాను డాక్టర్లతోనూ మాట్లాడానన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగుపడుతోందన్నారు. హృద్రోగ సంబంధ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారన్నారు. నిపుణులైన డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు చెప్పారన్నారు. ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తమ్మినేని వీరభద్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసిన ఏఐజీ ఆసుపత్రి
- రానున్న 48 గంటలు ముఖ్యమని… వివిధ విభాగాల వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడి
- బీపీ లెవల్స్ నిన్నటితో పోలిస్తే నార్మల్‌కు చేరుకున్నట్లు వెల్లడి
- లంగ్స్‌లో ఉన్న నీటిని తొలగిస్తున్నట్లు తెలిపిన వైద్యులు
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెల్త్ బులెటిన్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి బుధవారం విడుదల చేసింది. వివిధ విభాగాల వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారని, రానున్న 48 గంటలు ముఖ్యమని బులెటిన్‌లో తెలిపింది. తమ్మినేని బీపీ కంట్రోల్‌లో ఉందని… ప్రస్తుతం ఆయన మాట్లాడగలుగుతున్నారని పేర్కొంది. బీపీ లెవల్స్ నిన్నటితో పోలిస్తే నార్మల్‌కు చేరుకున్నట్లు తెలిపింది. లంగ్స్‌లో ఉన్న నీటిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
ఐసీయూలో వెంటిలెటర్ సాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్టు, వైద్యులు తెలిపారు. కాగా, తమ్మినేని వీరభద్రం మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఖమ్మం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయనకు చికిత్స అందిస్తున్నారు.