- నర్సాపురం నుంచి లోక్ సభకు శ్యామలాదేవి పోటీ చేయనున్నారంటూ ప్రచారం
- వైసీపీ టికెట్ ఆఫర్ చేసిందంటూ వార్తలు
- కృష్ణంరాజు జయంతి వేడుకల ఏర్పాట్లలో శ్యామలాదేవి బిజీ
- మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు
దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. నర్సాపురం నుంచి వైసీపీ తరఫున ఆమె లోక్ సభకు పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో శ్యామలాదేవి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ఈ నెల 20 (శనివారం)న కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ నిర్వహణను శ్యామలాదేవి స్వయంగా చూసుకుంటున్నారు.
కృష్ణంరాజు మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానని ఆమె వివరించారు. పేదలకు విద్య, వైద్యం అందేలా చూడాలని ఆయన ఎంతగానో తపనపడేవారని తెలిపారు. అందుకే ఆయన జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతానికి తన ఆలోచన అంతా నిరుపేదలకు వైద్యం అందించడంపైనే ఉందని చెప్పారు. జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యాక తన రాజకీయ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తానని ఆమె వివరించారు.
నర్సాపురం నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేయడానికి కృష్ణంరాజు ఎంతగానో పాటు పడ్డారని శ్యామలాదేవి చెప్పారు. ముఖ్యంగా పేదలకు నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాల కోసం కృషి చేశారని వివరించారు. ఆయన అభిమానులు ఈ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఆయన అభిమానులలో ఒకరైన డాక్టర్ వేణు కవర్తపు లండన్ లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని, గ్యాంగ్రీన్ వ్యాధికి వైద్యం అందించడంలో పేరు పొందారని చెప్పారు. ఆయన తరచూ కృష్ణంరాజును కలిసేందుకు ఇంటికి వస్తుండేవారని వివరించారు.
మన దేశంలోని పేదలకు కూడా డాక్టర్ వేణు సేవలు అందేలా చూడాలనే ఉద్దేశంతో కృష్ణంరాజు అపోలో యాజమాన్యంతో మాట్లాడారని చెప్పారు. ప్రస్తుతం డాక్టర్ వేణు అపోలో ఆసుపత్రి కన్సల్టెంట్ వైద్యుడిగా సేవలందిస్తున్నారని, నిరుపేదలకు గ్యాంగ్రిన్ వ్యాధి చికిత్సను అందుబాటులోకి తెచ్చారని శ్యామలాదేవి వివరించారు. ప్రస్తుతం సేవా కార్యక్రమాలపైనే తన దృష్టి మొత్తం కేంద్రీకరించానని ఆమె వివరించారు. జయంతి వేడుకల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడతానని శ్యామలాదేవి తెలిపారు.