బీహార్ రాజకీయాల్లో మరో సంచలనం.. 28న జేడీయూ-బీజేపీ కూటమి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం!
- ఆర్జేడీకి చెయ్యిచ్చి బీజేపీని అక్కున చేర్చుకుంటున్న నితీశ్ కుమార్
- కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించాక మారిన నితీశ్ వైఖరి
- డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సుశీల్ కుమార్ మోదీ
నితీష్ రాజకీయాలే సపరేటు…ఇప్పటికి ఐదుసార్లు ఆయన కూటములు మార్చుతూ వస్తున్నారు …ఆయినా ఆయన సీఎం పీఠాన్ని వదులుకోవడంలేదు …కాదు ..కాదు సీఎం పీఠం కోసమే నితీష్ అడ్డమైన దార్లు తొక్కుతుంటారని ప్రతీతి …అందుకే ఆయన రాజకీయనేత కంటే కూడా పచ్చి అవకాశవాదిగా వ్యవహరిస్తుంటారనే పేరును మూటగట్టుకున్నారు …నిలకడలేని రాజకీయాలు , నీతిలేని వ్యవహారాలు …దీంతో బీహార్ రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి…
బీహార్ రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. యూటర్న్‌కి పర్యాయపదంగా మారిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్జేడీకి చెయ్యిచ్చి మళ్లీ బీజేపీ పంచన చేరబోతున్నారు. ఇందులో భాగంగా సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిసింది. ఎల్లుండి (28న) ఆయన జేడీయూ-బీజేపీ కూటమి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని సమాచారం.
సుశీల్ మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ‘మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు’ అని పేర్కొన్నారు. రాజకీయాలను ఆయన ‘గేమ్ ఆఫ్ పాజిబిలిటీస్’గా అభివర్ణించారు. అయితే, అంతకుమించి మాట్లాడేందుకు నిరాకరించారు. ఆర్జేడీతో పొత్తుకు నితీశ్ బ్రేక్ చెప్పబోతున్నారంటూ ఒకటే ప్రచారం జరుగుతున్న వేళ తాజా పరిణామాలు మరింత ఆసక్తి రేకెత్తించాయి.
సోషలిస్టు నేత కర్పూరీ ఠాకూర్‌కు బీజేపీ సారథ్యంలోని కేంద్రం ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన తర్వాత బీహార్ రాజకీయాల్లో చకచకా మార్పులు జరిగాయి. నితీశ్‌ను బీజేపీకి మళ్లీ దగ్గర చేసింది ఇదేనని చెబుతున్నారు. మరోవైపు, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే ‘ఇండియా’ కూటమికి బాటలు వేసిన నితీశ్ కుమార్ తొలుత ఆయనే కూటమి నుంచి వైదొలగడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయన తర్వాత మరిన్ని విపక్ష పార్టీలు కూడా కూటమికి దూరం జరిగాయి.