- ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి
- రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థ
- ఈ నిధుల్లో బీజేపీ వాటా 66 శాతం, బీఆర్ఎస్‌కు 29, మిగిలినది టీడీపీకి
- ఈసీ విడుదల చేసిన తాజా డేటాలో వెల్లడి
ఢిల్కీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్ అరబిందో ఫార్మా కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్స్‌లో అత్యధిక వాటా బీజేపీకి అందినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌కు సంబంధించి 2022 నవంబర్‌లో అరబిందో ఫార్మా అధిపతి శరత్ చంద్రా రెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. ఆ మరుసటి ఏడాది ఆయన అప్రూవర్‌గా మారారు.
ఇక ఈసీ విడుదల చేసిన ఎన్నికల బాండ్స్ వివరాల ప్రకారం, 2021 ఏప్రిల్ నుంచి 2023 నవంబర్ మధ్య అరబిందో ఫార్మా రూ.52 కోట్ల విలువైన ఎన్నికల బాండ్స్ కొనుగోలు చేసింది. ఇందులో 66 శాతం నిధులు బీజేపీకి అందగా 29 శాతం బీఆర్‌ఎస్‌కు, మిగతా మొత్తం టీడీపీకి చేరాయి. అంతేకాకుండా, 2022లో శరత్ చంద్రారెడ్డి అరెస్టైన ఐదు రోజుల తరువాత కంపెనీ రూ.5 కోట్ల విలువైన బాండ్స్ కొనుగోలు చేసింది. ఈ బాండ్స్‌ను బీజేపీనే రిడీమ్ చేసుకున్నట్టు ఈసీ డేటాలో తేలింది.
కాగా, శనివారం నాటి మీడియా సమావేశంలో ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి.. శరత్ చంద్రా రెడ్డి పేరును ప్రస్తావించారు. ఈడీ చర్యల వెనక బీజేపీ హస్తం ఉందని పరోక్ష ఆరోపణలు చేశారు. ‘కేజ్రీవాల్ కేసులో ఈడీ పేర్కొన్న నిధులు వాస్తవానికి ఎన్నికల బాండ్స్ రూపంలో బీజేపీకి చేరాయని ఆమె తెలిపారు.
దేశంలో అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో అరబిందో ఒకటి. గతేడాది సంస్థ రూ.24 వేల కోట్ల పైచిలుకు ఆదాయం ఆర్జించింది. మొత్తం 150 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ ఆదాయంలో అధికశాతం అంతర్జాతీయ వెంచర్స్ ద్వారానే సమకూరుతోంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ పేర్కొన్న సౌత్ గ్రూప్‌లో అరబిందో ఫార్మా పేరు కూడా ఉంది.