Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్

  • ప్రొద్దుటూరులో ‘మేమంతా సిద్ధం’ సభ
  • ఎన్నికల ప్రచారం షురూ చేసిన సీఎం జగన్
  • చంద్రబాబు వదిన గారి చుట్టం అంటూ కంటైనర్ వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇటీవల విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. 

“చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ పేరుతో డ్రగ్స్ ను పెద్దమొత్తంలో దిగుమతి చేస్తుంటే సీబీఐ వాళ్లు దాడి చేశారు. ఈ రెయిడ్ జరిగిందని తెలియగానే ఎల్లో బ్రదర్స్ అందరూ ఉలిక్కిపడ్డారు. దొరికింది వాళ్ల బ్రదరే అయినా, అతడు దొరికిపోయాడు కాబట్టి అతడిని మన (వైసీపీ) వాడు అని దుష్ప్రచారం చేస్తున్నారు. 

తీరా చూస్తే వారు ఎవరయ్యా అంటే… సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, చంద్రబాబు వదిన గారి కొడుకు, వియ్యంకుడు ఆ కంపెనీలో గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు. బాబు అక్కడ నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు ఇంకా బాగా దగ్గరి బంధుత్వం ఉంది. 

నేరమంటూ జరిగితే చేసింది వారు… కానీ తోసింది మన మీద.  నేరం ఎక్కడైనా జరగనివ్వండి, ఎక్కడ ఏం జరిగినా మన మీద బురద చల్లడానికి ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు వెంటనే రెడీ అయిపోతారు. వీళ్లిద్దరికీ ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 తోడవుతాయి. వీళ్లందరూ ఓ ఎల్లో బ్యాచ్ గా తయారై నేరాన్ని మనకు ఆపాదిస్తారు. 

గత 45 ఏళ్లుగా చంద్రబాబు నడిపిస్తున్న క్షుద్ర రాజకీయాలను చూస్తూనే ఉన్నాం. దొరకని వాళ్లంతా టీడీపీ వాళ్లు… దొరికితే మాత్రం వైసీపీ వాళ్లు అంటారు. బతికున్నప్పుడు వివేకా గారిని శత్రువులా చూశారు. చనిపోయాక మాత్రం శవరాజకీయాలు, కుట్రలు చేస్తున్నారు. బతికున్న ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంపేస్తారు. చనిపోయాక వీళ్లే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని, విగ్రహాలు ఊరూరా పెట్టి, దండలు వేసి దణ్ణాలు పెడుతున్నారు. వీళ్ల నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండి.  

ఇలాంటి రాజకీయాలు చూస్తుంటే ఛీ అనిపిస్తుంది. మనల్ని తిట్టేవాళ్లు ఏమంటున్నారో కూడా తెలుసుకోవాలి కదా… అందుకే ఈనాడు పేపర్ చూస్తాను. పొద్దునే లేచి ఈనాడు పేపర్ చూస్తే ఛీ ఇదొక పేపరా అని రోజూ పక్కన పడేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 

ఈ చంద్రబాబు, ఈ దత్తపుత్రుడు, వీళ్లు కేంద్రం నుంచి ఒక పార్టీని ప్రత్యక్షంగా మద్దతు తెచ్చుకున్నారు, పరోక్షంగా మరో పార్టీని మద్దతు తెచ్చుకున్నారు. వీళ్లందరూ కూడా ఒక్క జగన్ మీద! ఇంతమంది ఏకమై ఒక్క జగన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్… వీళ్లంతా సరిపోవడంలేదని నా చెల్లెళ్లు ఇద్దరినీ కూడా తెచ్చుకున్నారు. 

నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తున్నది ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపెట్టాడు అంటే, ఈ ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ లేదంటే అందుకు కారణం… ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ, ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక సత్యం” అంటూ సీఎం జగన్ భావోద్వేగభరితంగా ప్రసంగించారు. 

బాబాయిని చంపిన హంతకుడికి వీరంతా నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారంటే దీని అర్థం ఏమిటి?: సీఎం జగన్

CM Jagan said his sisters supports murderer of YS Viveka

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఎన్నికల  ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేమంతా సిద్ధం పేరిట చేపడుతున్న ఈ ఎన్నికల ప్రచారంలో తొలి సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఇంత పెద్ద మీటింగ్ ఈ జిల్లాలో ఎప్పుడూ జరిగి ఉండదేమో అనేలా జన సంద్రం కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు నా విజయాలకు కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

ఈ రోజు రాష్ట్రంలో కోట్లాది గుండెలు మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయని తెలిపారు. మన జెండా మరే జెండాతో జట్టు కట్టడంలేదని, ప్రజలే అజెండాగా మన జెండా ఇవాళ  రెపరెపలాడుతోందని అన్నారు. 

“పేదల అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఈ దుష్టచతుష్టయాన్ని ఓడించాలి. ప్రజలే శ్రీకృష్ణుడిగా నేను అర్జునుడిగా ఎన్నికల సమరశంఖం పూరిస్తున్నాను. మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి ఒక్కరూ రెండు సార్లు ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి. అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసాలు చేసేవాళ్లు మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసే అలవాటు లేని చెడ్డవాళ్లంతా కూటమిగా వస్తున్నారు. మీ బిడ్డ ఒంటరిగా ఎన్నికల యుద్ధంలో అడుగుపెడుతున్నాడు. 

ప్రజలను నమ్మించి మోసం చేయడంలో, కుట్రలు, కుతంత్రాలు చేయడంలో, వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడంలో కూడా చంద్రబాబుకు 14 ఏళ్ల అనుభవం ఉంది. 

అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేయడంలోనే కాదు… వీళ్లకు కుటుంబాలను చీల్చడంలో కూడా బాగా అనుభవం ఉంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలను అందరూ చూస్తున్నారు. మా బాబాయిని ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనుక ఎవరు ఉన్నారో మీ అందరికీ రోజూ కనిపిస్తూనే ఉంది. 

వివేకా చిన్నాన్నను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో మీరందరూ రోజూ చూస్తున్నారు. ఆ చంపినోడ్ని నెత్తినపెట్టుకుని మద్దతు ఇస్తున్నది చంద్రబాబు, ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లోమీడియా, చంద్రబాబుకు చెందిన మనుషులు, వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తపించిపోతున్న ఒకరిద్దరు నా వాళ్లు (చెల్లెళ్లు). 

వీరంతా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారంటే దీని అర్థం ఏమిటి? అని అడుగుతున్నా. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే దీని అర్థమేమిటి? అని అడుగుతున్నా. నన్ను దెబ్బతీసే రాజకీయం అని వారికి వారే చెబుతున్నారంటే, ఇది కలియుగం కాకపోతే ఇంకేమిటి? ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా? 

ప్రజల మద్దతులేని చంద్రబాబు చేస్తున్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపు ఉన్నా నేను మాత్రం ప్రజల పక్షానే ఉన్నానని గర్వంగా చెబుతున్నాను. నేను ప్రజలను, దేవుడ్ని, ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నాను” అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Related posts

అధైర్యపడొద్దు… పార్టీ మీ వెన్నంటే ఉంది: మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా

Ram Narayana

మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

Ram Narayana

జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించిన కొణతాల రామకృష్ణ

Ram Narayana

Leave a Comment