Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

మా దేశ ఎన్నికల్లో భారత్ వేలుపెట్టింది.. కెనడా ఆరోపణ…

  • ఎన్నికల్లో విదేశీ జోక్యంపై దర్యాఫ్తులో భారత్ పేరు
  • పాక్, చైనా, రష్యాల పేర్లనూ ప్రస్తావించిన దర్యాఫ్తు సంస్థ
  • నిరాధార ఆరోపణలంటూ కొట్టిపారేసిన భారత విదేశాంగ శాఖ

కెనడాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత్, పాక్ జోక్యం చేసుకున్నాయంటూ ఆ దేశ స్వతంత్ర దర్యాఫ్తు సంస్థ ఆరోపించింది. చైనా జోక్యంపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిషన్.. భారత్ పేరును కూడా దర్యాఫ్తులో చేర్చింది. దీంతో ఇండియా, కెనడాల మధ్య ఇప్పటికే దిగజారిన దౌత్య సంబంధాలు మరింత అధ్వానంగా మారనున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కెనడా చేసిన ఆరోపణలు నిరాధారమంటూ భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది.

అసలేం జరిగిందంటే..
కెనడాలో 2021 లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశారు. కెనెడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) ఆధ్వర్యంలో స్వంతంత్ర కమిషన్ ఈ విషయంపై దర్యాఫ్తు ప్రారంభించింది. కెనడా ఎన్నికల్లో చైనా నిజంగానే జోక్యం చేసుకుందా.. ఏమేరకు ప్రభావం చూపించిందనే విషయంపై గత కొంతకాలంగా దర్యాఫ్తు చేస్తోంది. తాజాగా ఈ కమిషన్ తన దర్యాఫ్తులో భారత్, పాకిస్థాన్ పేర్లను కూడా చేర్చడం వివాదాస్పదంగా మారింది. తమ దేశ ఎన్నికల్లో భారత్ పాక్ లు కూడా వేలు పెట్టాయని ఆరోపించింది. చైనా, రష్యాల పేర్లనూ ప్రస్తావిస్తూ.. ఈ విషయంపైనా దర్యాఫ్తు జరపనున్నట్లు పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను భారత్ సహా ఆయా దేశాలన్నీ తిప్పికొట్టాయి. నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ సీఎస్ఐఎస్ పై మండిపడ్డాయి.

దౌత్య సంబంధాలపై ప్రభావం..
గతంలో నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య వివాదం నెలకొంది. తమ పౌరుడి హత్యలో భారత్ పాత్ర ఉందంటూ ట్రూడో అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు సహకరించాలంటూ భారత్ ను కోరినా స్పందించలేదని, ఆధారాలు సమర్పించినా తమ విజ్ఞప్తిని లెక్కచేయలేదని విమర్శించారు. ఈ ఆరోపణలను కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తోసిపుచ్చారు. కెనడా నుంచి తమకు ఎలాంటి ఆధారాలు కానీ, విజ్ఞప్తులు కానీ అందలేదని తేల్చిచెప్పారు. తగిన ఆధారాలు పంపిస్తే విచారణకు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. ఈ విషయంపై వివాదం ముదిరి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఓ దశలో కెనడా వెళ్లే భారత పౌరులు తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని, విద్యార్థులు కెనడాను అవాయిడ్‌ చేయాలని కేంద్రం అనధికారికంగా సూచనలు చేసింది. అదేవిధంగా భారత్ లో ఉన్న కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని, వీలైతే వెంటనే తిరిగి రావాలని ట్రూడో సర్కారు ఓ అడ్వైజరీ కూడా జారీ చేసింది. ఈ వివాదం ప్రభావం వాణిజ్యంపైనా పడింది. తాజాగా సీఎస్ఐఎస్ చేసిన ఆరోపణలతో కెనడా, భారత్ ల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారుతాయని దౌత్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

ట్విట్ట‌ర్‌కు ప్రత్యామ్నాయంగా వ‌చ్చిన ‘కూ’ మూత‌!

Ram Narayana

భారత్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కెనడా ప్రధాని ట్రూడో

Ram Narayana

ఉక్రెయిన్‌పై ర‌ష్యా క్షిపణి దాడి.. 51 మంది మృతి!

Ram Narayana

Leave a Comment