- ప్రయాణికులెవరూ గాయపడలేదన్న జపాన్ రైల్వే
- మరో రైల్లో ప్రయాణికుల తరలింపు
జపాన్ లో వేగానికి మారుపేరైన బుల్లెట్ రైళ్లు ఆలస్యం కావడం అరుదే. అందులోనూ రైళ్లలో పాముల బెడద వల్ల ఆలస్యం కావడం అనేది అత్యంత అరుదు. కానీ అలాంటి అరుదైన సందర్భమే తాజాగా ఎదురైంది. నగోయా నుంచి టోక్యో వెళ్లే బుల్లెట్ రైల్లో మంగళవారం సాయంత్రం ఓ పాము దూరడం ప్రయాణికుల్లో కలకలం సృష్టించింది. రైల్లో ఓ 40 సెంటీమీటర్ల చిన్న పాము కదులుతుండటాన్ని ప్యాసింజర్ ఒకరు గమనించి వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో బుల్లెట్ రైలు 17 నిమిషాలపాటు నిలిచిపోయింది. ప్రయాణికులను మరో రైల్లోకి తరలించి గమ్యస్థానం చేర్చారు. అయితే రైల్లోకి ఆ పాము ఎలా వచ్చిందో తెలియలేదు. అలాగే ఆ పాము విషపూరితమైనదా కాదా అనేది కూడా వెంటనే తెలియరాలేదు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరూ గాయపడలేదని సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
చిన్న కుక్కలు, పిల్లులకు అనుమతి
జపాన్ రైల్వేస్ నిబంధనల ప్రకారం బుల్లెట్ రైళ్లలోకి ప్రయాణికులు చిన్న కుక్కలు, పిల్లులు, పావురాలు లాంటి వాటిని తెచ్చుకోవచ్చు. కానీ పాములను తీసుకెళ్లేందుకు మాత్రం అనుమతి లేదు. “రైళ్లలోకి పాములు దూరతాయని ఊహించడం కష్టమే. బుల్లెట్ రైళ్లలోకి పాములను తీసుకురాకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ మేం ప్రయాణికుల బ్యాగ్ లను తనిఖీ చేయం” అని రైలు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నాడు.
గంటకు 285 కి.మీ. వేగం
జపాన్ రైల్వేస్ 1964లో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రమాదం లేదా మరణం సంభవించలేదు. ఈ రైళ్లు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. ఈ రైళ్ల సగటు ఆలస్య వ్యవధి కేవలం 0.2 నిమిషాలే.