అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనకు ధర్మశాస్త్రం …డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్.
దానివల్లనే ప్రపంచదేశాల్లో మనకు గుర్తింపు …
దాన్ని పరిరక్షించుకోవడం మనందరి కర్తవ్యం.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి ..అందుకు ఓటు అనే ఆయుధంతో బుద్దిచెప్పాలి
భారతదేశం ప్రజాస్వామ్య లౌకిక రాజ్యమని రాజ్యాంగం మన దేశానికి ఆత్మ వంటిదని దాన్ని పరిరక్షించుకోవడం మనందరి కర్తవ్యం అని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్ అన్నారు . మంగళవారం ఖమ్మం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారతదేశ ప్రజలందరికీ ధర్మ శాస్త్రమని దానివల్లనే ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు . కానీ ఈరోజు దాన్ని మార్చే కుట్ర జరుగుతున్నదని దాన్ని అడ్డుకోవలసిన బాధ్యత ప్రజాస్వామికవాదులైన మనందరిపై ఉందన్నారు . ప్రస్తుతం మన దేశం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో 35వ స్థానంలో ఉందని , మతపరమైన ఉద్రిక్తలు ప్రజలమధ్య ద్వేషాన్ని పెంచే మత రాజకీయాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు . ఇలాంటి తరుణంలో సమాజంలో ప్రజాస్వామ్య విలువలు , లౌకిక సూత్రాలు , సామాజిక న్యాయం , సమానత్వం , సోదర భావం మరియు మతసామరస్యాన్ని పెంపొందించేందుకు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి కృషి చేస్తుందన్నారు . అంతే కాకుండా రాబోయే ఎన్నికలు సాధారణమైనవి కావని దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ప్రజలందరూ తమ ఓటును సద్వినియోగం చేసుకొని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ దేశాన్ని కాపాడే వారికి అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .
దీన్ని పురస్కరించుకొని ఈనెల 8వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఎస్ ఆర్ కన్వెన్షన్ ఎసి ఫంక్షన్ హాల్ లో రాబోయే ఎన్నికలు మన బాధ్యత అనే అంశంపై ఒక గొప్ప సెమినార్ నిర్వహించబడుతుందన్నారు .ఈ సెమినార్ లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీ పరకాల ప్రభాకర్ , ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్ , రాష్ట్ర మాజీ కార్యదర్శి జనూనె- ఇస్లామి హింద్ , తెలంగాణ, మొహమ్మద్ ఇల్యాస్ మరియు తదితర మేధావులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు . ఈ సెమినార్ కు కుల మతాలకతీతంగా ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సెమినార్ను జయప్రదం చేయాలన్నారు . ఈ కార్యక్రమంలో దేవ రెడ్డి విజయ్ , ఇలియాస్ , షేక్ కాసిం తదితరులు పాల్గొన్నారు.