Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

నేను హిందూ, ముస్లిం పేరు ఎత్తలేదు.. ‘అధిక సంతానం వారు’ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ వివరణ…

  • అధిక సంతానంతో బాధపడుతున్న పేదలను ఉద్దేశించే మాట్లాడానని స్పష్టీకరణ
  • హిందువులు, ముస్లింలంటూ వేరు చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయబోనని వ్యాఖ్య
  • ఒకవేళ అలా చేస్తే ప్రజాజీవితంలో కొనసాగే అర్హత కోల్పోతానని వెల్లడి
  • గోధ్రా అల్లర్ల పేరుచెప్పి ముస్లింలలో తనకున్న ఇమేజ్ ను ప్రత్యర్థులు చెడగొట్టారని మండిపాటు
  • నేటికీ తన స్నేహితుల్లో చాలా మంది ముస్లింలేనన్న మోదీ

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను చేసిన ‘అధిక సంతానం ఉన్నవారు’ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇచ్చారు. తాను కేవలం ముస్లింలను ఉద్దేశించి అనలేదని.. అధిక సంతానంతో ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబం గురించి ఆ మాటలు అన్నానని స్పష్టం చేశారు. ఒకవేళ హిందూవులు, ముస్లింలంటూ తాను వేరు చేసి మాట్లాడితే ఆ రోజు నుంచి ప్రజాజీవితంలో కొనసాగే అర్హత కోల్పోతానని వ్యాఖ్యానించారు. న్యూస్ 18 చానల్ కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు. 

‘నేను ముస్లింల పట్ల ప్రత్యేక ప్రేమ కనబరచను. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నేను పనిచేయను. అందరితో కలసి అందరి అభివృద్ధి అనే నినాదాన్నే నమ్ముతాను. కానీ నేను ఆ మాటలు అన్నట్లు ప్రచారం కావడం నన్ను షాక్ కు గురిచేసింది. అధిక సంతానం ఉన్నవారి గురించి నేను మాట్లాడితే అది ముస్లింలను ఉద్దేశించే అని ఎవరు చెప్పారు? పేద కుటుంబాలన్నింటిలోనూ ఈ పరిస్థితి నెలకొంది. పేదరికం ఉన్న చోట మతంతో సంబంధం లేకుండా అధిక సంతాన సమస్య ఉంటుంది. నేను హిందువు లేదా ముస్లిం పేరు ఎత్తలేదు. ఎందరు పిల్లల బాగోగులు చూసుకోగలరో అంతమందినే కనాలి. ప్రభుత్వమే మీ పిల్లల బాగోగులు చూసుకోవాలనే పరిస్థితి కల్పించకూడదు’ అని మోదీ వ్యాఖ్యానించారు.

తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2002లో గోధ్రా రైలు దహనం ఘటన అనంతరం జరిగిన అల్లర్ల గురించి మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  గోధ్రా అల్లర్ల పేరుచెప్పి ముస్లింలలో తనకున్న ఇమేజ్ ను తన రాజకీయ ప్రత్యర్థులు చెడగొట్టారని మోదీ పేర్కొన్నారు.

‘ఇది ముస్లింలకు సంబంధించిన అంశం కాదు. ముస్లింలు వ్యక్తిగతంగా తనను ఎంతగా అభిమానించినా వారు ఏది చేయాలో, ఏది చేయకూడదో ఓ నిరంతర ఆలోచనా తరంగం వారిని నిర్దేశిస్తుంది. నా ఇంటి చుట్టుపక్కల ముస్లిం కుటుంబాలే నివసిస్తున్నాయి.  ఈద్ పండుగ రోజు మా ఇంట్లో వంట చేసుకొనే వాళ్లం కాదు. ముస్లిం కుటుంబాల ఇళ్ల నుంచే మాకు వంటకాలు వచ్చేవి. నేను అలాంటి ప్రపంచంలో పెరిగా. ఇవాళ్టికీ నా స్నేహితుల్లో చాలా మంది ముస్లింలు ఉన్నారు. కానీ 2002 గోధ్రా అల్లర్ల తర్వాత నా ఇమేజ్ ను చెడగొట్టారు’ అని మోదీ చెప్పారు.

ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ముస్లింలు మీకు ఓటు వేస్తారని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు మోదీ తనదైన శైలిలో బదులిచ్చారు. దేశ ప్రజలంతా తనకు ఓటు వేస్తారని చెప్పారు. హిందూ ముస్లింలంటూ వేరు చేసి మాట్లాడిన రోజున తాను ప్రజాజీవితంలో కొనసాగే అర్హత కోల్పోతానన్నారు.  అందుకే హిందూ, ముస్లిం పేరుతో రాజకీయాలు చేయనని, ఇది తన ప్రతిజ్ఞ అని ప్రధాని తెలిపారు.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరి దగ్గర ఉన్న బంగారం, ఆస్తులను స్వాధీనం చేసుకొని అధిక సంతానం ఉన్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాని మోదీ రాజస్తాన్ లో ఇటీవల చేపట్టిన ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గెలిస్తే మహిళల మెడలోని మంగళసూత్రం సహా బంగారం అంతా లాక్కుంటుందని ఆరోపించారు. అయితే ముస్లింలను ఉద్దశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.

Related posts

NDA Vs I.N.D.I.A. మధ్య ఉత్తర ప్రదేశ్‌లో తొలి పోరు

Ram Narayana

కాంగ్రెస్ అభ్యర్థులతో రాహుల్ గాంధీ, ఖర్గే నేడు కీలక భేటీ…

Ram Narayana

చంద్ర‌బాబును క‌లిసిన స్టాలిన్‌

Ram Narayana

Leave a Comment