Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

స్మృతి ఇరానీ నుంచి రాజీవ్ చంద్రశేఖర్‌ వరకు ఓడిపోయిన కేంద్రమంత్రులు వీరే!

  • అమేథీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ చేతిలో ఓడిన స్మృతి ఇరానీ
  • తిరువనంతపురంలో ఓడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
  • ఓడిన కేంద్ర మంత్రుల జాబితాలో అర్జున్ ముండా, కైలాష్ చౌదరి సహా పలువురు  

లోక్‌సభ ఎన్నికలలో 240 సీట్లు సాధించిన బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఓటములను మూటగట్టుకున్నారు. ఈ జాబితాలో పలువురు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. స్మృతి ఇరానీ, అర్జున్‌ ముండా, అజయ్‌ మిశ్రా వంటి సీనియర్ లీడర్లు ఈ జాబితాలో ఉన్నారు. 

కేంద్ర శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన స్మృతి ఇరానీ అమేథీ లోక్‌సభ స్థానంలో పరాజయం పాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే స్థానంలో రాహుల్ గాంధీని ఓడించిన ఆమె ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ శర్మ చేతిలో ఏకంగా 1,67,196 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. 2019లో రాహుల్ గాంధీని ఓడించడంతో ఈ సీటు బీజేపీకి కంచుకోటగా మారుతుందని ఆశలు పెట్టుకున్నప్పటికీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి వైపు మొగ్గుచూపారు.

ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరించిన అజయ్ మిశ్రా ఉత్తరప్రదేశ్‌లో భేరీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఉత్కర్ష్ వర్మ చేతిలో 34,329 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.  లఖింపూర్ ఖేరీ ఘటనతో ఈయన వివాదం పాలైన విషయం తెలిసిందే.

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అర్జున్ మొండా భారీ తేడాతో ఓడిపోయారు. జార్ఖండ్‌లోని ఖుంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్ చేతిలో ఏకంగా 1,49,675 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు.

వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కైలాశ్ చౌదరి రాజస్థాన్‌లోని బార్మర్‌ స్థానం చతికిలపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉమ్మెద రామ్ బెనివాల్ చేతిలో ఏకంగా 4.48 లక్షల ఓట్లతో కైలాశ్ చౌదరి ఓడిపోయారు. ఈ స్థానంలో ఆయన మూడో స్థానంలో నిలిచారు.

ఇక కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన రాజీవ్ చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి ఓడిపోయారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్ చేతిలో 16,077 ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు.  

అంతేకాదు.. మహేంద్ర నాథ్ పాండే, కౌశల్ కిషోర్, సాధ్వి నిరంజన్ జ్యోతి, సంజీవ్ బాల్యన్, రావ్ సాహెబ్ దాన్వే, ఆర్కే సింగ్, వీ.మురళీధరన్, ఎల్ మురుగన్, సుభాష్ సర్కార్, నిషిత్ ప్రమాణిక్ వంటి కేంద్ర మంత్రులు తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు.

Related posts

భార‌త్‌లో కూడా బంగ్లా త‌ర‌హా హింసాత్మ‌క నిర‌స‌న‌లు జ‌ర‌గొచ్చు: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్‌

Ram Narayana

తమిళనాడు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకంపై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్య!

Ram Narayana

ఢిల్లీ ప్రజలు ఆప్ ను చీపురుతో ఊడ్చేశారు: బండి సంజయ్!

Ram Narayana

Leave a Comment