- దేశవ్యాప్తంగా 8వ విద్యార్థి వీసా వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న భారత్‌లోని యూఎస్ ఎంబసీ
- ఈ సందర్భంగా ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై కేంద్రాల్లో ఇంటర్వ్యూలు
- నిన్న ఒక్కరోజే 4వేల మందికి ఇంటర్వ్యూ
- ఈసారి కూడా భారీగానే వీసాల జారీ ఉంటుందన్న తాత్కాలిక కాన్సుల్ జనరల్ సయ్యద్ ముజ్‌తబా అంద్రాబీ
- 2023లో భారతీయ విద్యార్థులకు 1.40 లక్షల వీసాలు జారీ చేసిన యూఎస్
అమెరికా గతేడాది భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో 1.40 లక్షల విద్యార్థి వీసాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి కూడా అదేస్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగానే ఇండియన్ స్టూడెంట్స్ కు వీసాలు జారీ చేసే అవకాశం ఉందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఎనిమిదో విద్యార్థి వీసా వార్షికోత్సవాన్ని భారత్‌లోని యూఎస్ ఎంబసీ గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్‌కతా కేంద్రాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ప్రారంభించింది. దీంతో ఢిల్లీలోని అమెరికా ఎంబసీ వెలుపల భారీ క్యూ కనిపించింది.
ఇక అగ్రరాజ్యం విశ్వవిద్యాలయాలలో చేరుతున్న భారత విద్యార్థుల సంఖ్య ప్రతియేటా అంతకంతకూ పెరుగుతోంది. అందుకు తగినట్లుగానే అమెరికా కూడా వీసాల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. దీనిలో భాగంగానే 2023లో రికార్డు స్థాయిలో 1.40 లక్షల స్టూడెంట్ వీసాలను జారీ చేసింది. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వకపోవడం గమనార్హం. 2018, 2019, 2020ల్లో కలిపి ఇచ్చిన సంఖ్య కంటే 2023లోనే అధిక వీసాలు జారీ అయ్యాయి.
ఒక్కరోజే 4,000 మందికి ఇంటర్వ్యూ!
ఇదే విషయమై ఇండియాలోని యూఎస్ ఎంబసీ తాత్కాలిక కాన్సుల్ జనరల్ సయ్యద్ ముజ్‌తబా అంద్రాబీ మాట్లాడారు. 2023తో పోలిస్తే ఈ ఏడాది కూడా విద్యార్థి వీసాల సంఖ్య అదే మాదిరిగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. వీటిపైనే ప్రధాన దృష్టి సారించామన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న కాన్సులేట్ కార్యాలయాల్లో ముమ్మరంగా కృషి చేస్తున్నామని తెలిపారు. గురువారం ఒక్కరోజే 4వేల మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేశామని వెల్లడించారు.
మాములుగా ఈ సీజన్‌కు విద్యార్థి వీసాలను జూన్ నుంచి ఇస్తామని, కానీ ఈసారి మే నెలలోనే ప్రారంభించినట్లు తెలిపారు. ఇది ఆగస్టు ఆఖరు వరకూ కొనసాగుతుందని ముజ్‌తబా అంద్రాబీ చెప్పారు. బీ1, బీ2 వీసాకు కొత్తగా దరఖాస్తు చేసేవారికి తప్ప మిగిలిన అన్ని కేటగిరీల్లో ఇంటర్వ్యూకు వేచి ఉండే సమయాన్ని పూర్తిగా తగ్గించామని పేర్కొన్నారు. బీ1, బీ2 వీసాలకు వేచి ఉండే సమయమూ 70శాతం వరకూ తగ్గిందని తెలిపారు. అమెరికాలో 4,500 అక్రిడిటేటెడ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, వాటిపై అవగాహన కల్పిస్తున్నామని తాత్కాలిక కాన్సుల్ జనరల్ చెప్పుకొచ్చారు.