- బీఆర్ఎస్ బలహీనపడినప్పుడు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతారని విమర్శ
- డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే వాయిదా వేయాలని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం
- పేద విద్యార్థులు దీక్ష చేస్తుంటే మీరెందుకు చేయరని నిలదీత
- రంగా బిల్లాలు 15 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సవాల్
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని దీక్ష చేయాల్సింది పేద విద్యార్థులు కాదని… దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట చేయాలని సవాల్ చేశారు. మహబూబ్ నగర్‌లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ… బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను సన్నాసి అంటూ విరుచుకుపడ్డారు.
ఉద్యమం సమయంలో హరీశ్ రావు పెట్రోల్ డ్రామా ఆడితే శ్రీకాంతచారి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయించాలని చూస్తున్నారని విమర్శించారు. 11 వేలకు పైగా పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పరీక్షలు వాయిదా వేయాలంటూ బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. కోచింగ్ సెంటర్ల మాఫియా కోసం విపక్షాలు పరీక్షల వాయిదా అంటూ ఆందోళనలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరీక్షలు ఒక్క నెల రోజులు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్‌లకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్నారు.
అందుకే, పరీక్షలు వాయిదా అంటున్నారని ధ్వజమెత్తారు. ‘బావ, బావమరుదులు హరీశ్ రావు, కేటీఆర్‌లకు సవాల్ చేస్తున్నాను. సన్నాసుల్లారా.. అమాయక విద్యార్థులను దీక్షకు ఎందుకు కూర్చోబెడుతున్నారు. మీరు కూర్చోండి. మా ప్రాణాలైనా పోవాలి… పరీక్షలైనా వాయిదా పడాలనే నినాదంతో పదిహేను రోజులు దీక్ష చేయండి. ఎవరు ఆపుతారో చూద్దాం. వారు దీక్ష చేయాలని సవాల్ చేస్తున్నాను. పేద పిల్లలు దీక్షలు చేస్తుంటే మీరు తింటూ ఉంటారా? విద్యార్థుల బాధలు తీరాలంటే హరీశ్ రావు, కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. పేద పిల్లలు దీక్షకు కూర్చోవద్దు. మీరు కూర్చోండి. మీ వాదనలో నిజం ఉంటే మీరే దీక్ష చేయండి. ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ వదులుకోదు కదా.. మీకు దమ్ముంటే కూర్చోవాలని సవాల్ విసురుతున్నాను’ అన్నారు.
విద్యార్థులకు నిజంగానే అన్యాయం జరుగుతుందని భావిస్తే బిల్లా రంగాలు దీక్షకు ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. రాజకీయంగా పార్టీ చచ్చిపోయినప్పుడల్లా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారా? అని ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా వేస్తే పిల్లల జీవితాలు ఆగమవుతాయన్నారు. పిల్లలకు పరీక్షలు వాయిదా వేస్తే తనకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం రాజకీయ కోణంలో వాయిదా డిమాండ్ చేస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతాయన్నారు.