- రైతుల జీవితాల్లో ఇంత వరకు జరగని సంఘటన జరుగుతోందని వ్యాఖ్య
- దేశ చరిత్రలోనే ఒకేసారి రూ.31 వేల కోట్లు మాఫీ చేయడం ఇదే మొదటిసారి అని వ్యాఖ్య
- అందుకే సంబురాలు చేసుకుంటున్నామన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి
దేశ చరిత్రలో ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పుడూ జరగలేదని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… దీనిని (రుణమాఫీ) గొప్ప సంఘటనగా అభివర్ణించారు. రైతుల జీవితాల్లో ఇంత వరకు జరగని సంఘటన ఇప్పుడు జరుగుతోందన్నారు.
తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రూ.1 లక్ష వరకు రుణాలు మాఫీ చేశామని, అదీ రూ.25 వేల చొప్పున నాలుగు విడతలుగా చేశామన్నారు. అందుకు ఆరోజు రూ.16 వేల కోట్లు ఖర్చయిందన్నారు. 2018లో రెండో విడతలో రూ.20 వేల కోట్ల రుణాలు ఉంటే రూ.12 వేల కోట్లు మాఫీ చేసినట్లు చెప్పారు. మరో రూ.8 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాలేదన్నారు.
కానీ 40 లక్షల మంది రైతులకు… రూ.2 లక్షల వరకు రుణమాఫీ, మొత్తం రూ.31 వేల కోట్లు ఒకేసారి అందించడం మాత్రం భారతదేశంలో ఇదే మొదటిసారి అన్నారు. ఇలాంటి రుణమాఫీ గతంలో ఎన్నడూ జరగలేదని, అందుకే సంబురాలు చేసుకుంటున్నట్లు తెలిపారు.