- నేడు అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
- కొలంబియా మాఫియా కింగ్ ఎస్కొబార్ అంశాన్ని ప్రస్తావించిన వైనం
- జగన్ కూడా బాగా ధనవంతుడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడని వెల్లడి
ఏపీ అసెంబ్లీలో ఇవాళ శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ ను కొలంబియా దివంగత మాఫియా కింగ్ పాబ్లో ఎస్కొబార్ గవేరియాతో పోల్చారు. తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో జగన్ వంటి నేతను ఎక్కడా చూడలేదని, అందుకే అతడిని ఎస్కొబార్ తో పోల్చుతున్నానని చంద్రబాబు తెలిపారు.
“పాబ్లో ఎస్కొబార్ కొలంబియా దేశానికి చెందిన డ్రగ్ లార్డ్. అతడొక నార్కో టెర్రరిస్ట్. ఘోరమైన విషయం ఏంటంటే… అలాంటి వ్యక్తి రాజకీయ నేతగా మారాడు. మాదక ద్రవ్యాల అమ్మకాన్ని మరింత విస్తరించాడు. ఆ సమయంలో అతడు సంపాదించిన సొమ్ము అక్షరాలా రూ.2.51 లక్షల కోట్లు. ఇప్పుడా సొమ్ము విలువ రూ.7.54 లక్షల కోట్లు. కేవలం డ్రగ్స్ అమ్మి అతడు అంత సంపాదించాడు.
జగన్ కూడా టాటా, అంబానీలను మించి ధనవంతుడు కావాలనుకుంటున్నాడు. కొందరికి అవసరాలు ఉంటాయి, కొందరికి దురాశ ఉంటుంది, కొందరికి వెర్రి వ్యామోహం ఉంటుంది, ఆ వెర్రి వ్యామోహం ఉన్న వాళ్లు ఏమైనా చేస్తారు” అంటూ చంద్రబాబు వివరించారు.