Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబు గారూ… మీరు మళ్లీ అదే మేకను తెచ్చుకోవాల్సి ఉంటుంది: అంబటి రాంబాబు!

  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
  • ఈ చట్టం తెచ్చింది కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వమేనన్న అంబటి రాంబాబు
  • మేకను పట్టుకుని కుక్క, కుక్క అని దాన్ని వదిలేశారని వెల్లడి
  • చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పకుండా అమలు చేస్తాడని వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సమీక్షలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలించిన సంగతి తెలిసిందే. పాస్ పుస్తకాలపైనా, భూముల సరిహద్దు రాళ్లపైనా జగన్ బొమ్మలు వేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎవరి బొమ్మలు లేకుండా కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, సరిహద్దు రాళ్ల కోసం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా భూ రీ సర్వేలో మొత్తం మూడు దశలు ఉంటాయని, తమ ప్రభుత్వ హయాంలో రెండు దశల రీ సర్వే పూర్తయిందని రాంబాబు వెల్లడించారు. 6 వేల గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తయిందని తెలిపారు. ఇందులో 4 వేల గ్రామాల్లో పాస్ పుస్తకాలు ఇచ్చామని వివరించారు. పలు  గ్రామాల్లో డ్రోన్ సర్వే కూడా చేపట్టామని తెలిపారు. రైతులకు ఎలాంటి స్థల వివాదాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే తాము రీ సర్వే చేపట్టామని అంబటి రాంబాబు వెల్లడించారు. 

“కాబట్టి చంద్రబాబుకు వేరే దిక్కు లేక జగన్ పై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఈ సర్వే తప్పు, ఆ సర్వే తప్పు అన్నారు. చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ఉన్నతమైనది. ఈ చట్టం ద్వారా అనేక వివాదాలు తొలగిపోతాయి. 

ఇది జగన్ బుర్రలో పుట్టిన ఆలోచనో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందో కాదు… ఇవాళ మీరు (చంద్రబాబు) ఏ కేంద్ర ప్రభుత్వంలో అయితే భాగస్వాములుగా ఉన్నారో ఆ కేంద్ర ప్రభుత్వమే ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రాష్ట్రాలకు అందించి మీకు అనుగుణంగా చేసుకోండి అంటే ఆ ప్రకారమే చేశాం. 

ఈ చట్టం దుర్మార్గమైనది, దీనిపై జగన్ బొమ్మ ఉంది… అధికారంలోకి రాగానే తీసేస్తాం అన్నారు… తీసేశారు. మేకను పట్టుకుని కుక్క, కుక్క అని దాన్ని వదిలేశారు. చంద్రబాబు గారూ మీరు అదే మేకను తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు మళ్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఆ చట్టం పేరు మార్చుకుంటారేమో నాకు తెలియదు కానీ, ఆ చట్టాన్ని మాత్రం మళ్లీ తెచ్చుకోవడం ఖాయం” అని అంబటి రాంబాబు వివరించారు.

Related posts

ఎన్నికలకు సిద్ధమవుతున్న వైకాపా…సర్వేల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసిన జగన్ …

Ram Narayana

షర్మిల అంటే మాకు గౌరవం.. ఆమె ఇలా మాట్లాడటం దారుణం: వెల్లంపల్లి

Ram Narayana

చంద్రబాబుకు జైల్లో ఏసీ పెట్టకుండా వేదిస్తున్నారన్న యనమల ….

Ram Narayana

Leave a Comment