గురువారం వయనాడ్‌కి రాహుల్
ప్రియాంకా గాంధీలు..
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటన..
ప్రకృతి అందాలకు నెలవైన కేరళ ఇప్పుడు వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనతో మృతుల దిబ్బగా మారింది. జిల్లాలోని ముండక్కై, చూరల్‌మల ప్రాంతాల్లో ల్యాండ్ స్లైండింగ్ మూలంగా విపత్తు సంభవించింది. మరణాల సంఖ్య 200ని దాటింది. టీ తోటల్లో పనిచేసే 600 మందికి పైగా కార్మికుల జాడ తెలియడం లేదు. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఘటనలో 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. చాలా మంది ప్రజలు బురద, మట్టి కింద సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ప్రభావిత వయనాడ్ ప్రాంతంలో గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. బుధవారమే వీరిద్దరు వయనాడ్ వెళ్లాల్సి ఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం ఫలితంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కుదరదని అధికారులు తెలియజేయడంతో పర్యటన వాయిదా పడింది. వీరిద్దరు ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ మరియు సెయింట్ జోసెఫ్ యుపి స్కూల్, మెప్పాడిలోని రిలీఫ్ క్యాంపులను సందర్శిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీ, మెప్పాడిని కూడా సందర్శిస్తారని తెలియజేశారు