ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు…
రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుందన్న సుప్రీంకోర్టు
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమంజసమేనని వెల్లడి
6:1 మెజారిటీతో ఉపవర్గీకరణకు మద్దతు పలికిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం
వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది..
ఎస్సీ, ఎస్టీ కులాల రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ తన తీర్పులో స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమంజసమేనని ఉద్ఘాటించింది.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదంటూ 2004లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం నేడు పక్కనబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయకూడదంటూ ఇచ్చిన నాటి తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది.
ఈ బెంచ్ లో, ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ ఒక్క జస్టిస్ బేలా త్రివేది మాత్రమే అభ్యంతరం తెలిపారు. ఉపవర్గీకరణకు సీజేఐ చంద్రచూడ్ తో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సతీశ్ చంద్ర, జస్టిస్ మనోజ్ మిశ్రా అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
సుప్రీం తీర్పును అనుసరించి రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. ఆ మార్గదర్శకాలు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని నిర్దేశించింది.
ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది: సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ స్పందన
విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ సమంజసమేనని, ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు చారిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ స్పందించారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందని వెల్లడించారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబరు 5నే చెప్పానని, నేడు సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందని వ్యాఖ్యానించారు.
న్యాయం, ధర్మం కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేసి విజయం సాధించామని చెప్పారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఎమ్మార్పీఎస్ పోరాడిందని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు… స్పందించిన కేటీఆర్
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తాము అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. వర్గీకరణకు మద్దతుగా తమ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని గుర్తు చేశారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలు మాత్రం ఓట్ల రాజకీయం చేశాయని ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన బీజేపీ
ఎస్సీ వర్గీకరణ తీర్పును తెలంగాణ బీజేపీ స్వాగతించింది. ఈ మేరకు ఆ పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని నరేంద్రమోదీ సంపూర్ణంగా సహకరించారన్నారు. వర్గీకరణ ప్రక్రియకు బీజేపీ సంపూర్ణ మద్దతును ప్రకటించిందన్నారు.
ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు… ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే…!
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. శ్రీశైలం వద్ద సున్నిపెంటలో ఇవాళ సాగునీటి వినియోగదారులతో ముఖాముఖి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.
గతంలోనే వర్గీకరణ చేస్తూ ఏ, బీ, సీ, డీ కేటగిరీలు తీసుకువచ్చానని వెల్లడించారు. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను తాను ఆనాడే ప్రతిపాదించానని వెల్లడించారు. అందుకే 1996-97లో రామచందరరావు కమిషన్ వేసి, ఆర్థిక పరిస్థితులన్నీ అధ్యయనం చేసిన తర్వాత… ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా తానే విభజించానని చంద్రబాబు వెల్లడించారు.
ఆ తర్వాత కాలంలో వర్గీకరణ అంశం అనేక కోర్టులో విచారణకు వచ్చిందని, చివరికి సుప్రీంకోర్టులో నేడు ఏడుగురు జడ్జిల ధర్మాసనం వర్గీకరణ సబబేని ధృవీకరించిందని చంద్రబాబు వివరించారు. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులోనూ సామాజిక న్యాయం చేశామని చెప్పారు.