- దర్శి మండలంలోని కొత్తపల్లిలో విషాదం
- సాగర్ కాలువలో ఈతకు వెళ్లి గల్లంతైన వైనం
- ఓ విద్యార్థి మృతదేహం లభ్యం, మరో ఇద్దరి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
ప్రకాశం జిలాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. దర్శి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కొత్తపల్లికి చెందిన పోతిరెడ్డి లోకేశ్ (19), కందురి చందుకిరణ్ (18), బత్తుల మణికంఠరెడ్డి (18) సాగర్ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలించగా పోతిరెడ్డి లోకేశ్ మృతదేహం లభ్యమైంది. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కొత్తపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.