Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

పాకిస్థాన్‌లో ఉగ్రదాడుల్లో 70 మందికి పైగా మృతి!

  • బ‌లూచిస్థాన్ ప్రావిన్స్ లో ప‌లుచోట్ల ఉగ్ర‌దాడులు
  • లాస్బెలా జిల్లాలోని బేలా ప‌ట్ట‌ణంలో 14 మంది సైనికులు, పోలీసుల మృతి
  • 21 మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన‌ సైన్యం
  • ముసాఖేల్ జిల్లాలో 23 మంది పౌరుల‌ను చంపిన ఉగ్ర‌వాదులు
  • ప్ర‌ధానంగా పంజాబ్ ప్రావిన్స్ ను అనుసంధానించే హైవే వెంబ‌డి ఉగ్ర‌దాడులు

పాకిస్థాన్‌లో మ‌రోసారి ఉగ్ర‌వాదులు పేట్రేగిపోయారు. నైరుతి పాకిస్థాన్‌లోని బ‌లూచిస్థాన్ ప్రావిన్స్ లో ప‌లుచోట్ల జ‌రిగిన ఉగ్ర‌దాడుల్లో 70 మందికి పైగా మృతిచెందిన‌ట్లు అక్క‌డి మిలిట‌రీ, పోలీస్ అధికారులను ఉటంకిస్తూ మీడియా వెల్ల‌డించింది. 

లాస్బెలా జిల్లాలోని బేలా ప‌ట్ట‌ణంలోని ఒక జాతీయ ర‌హ‌దారిపై వాహ‌నాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిలో 14 మంది సైనికులు, పోలీసులు చ‌నిపోయారు. అలాగే 21 మంది ఉగ్ర‌వాదుల‌ను సైన్యం మ‌ట్టుబెట్టిన‌ట్లు మిలిట‌రీ అధికారులు వెల్ల‌డించార‌ని అల్ జ‌జీరా పేర్కొంది. 

ముసాఖేల్ జిల్లాలో ఉగ్ర‌వాదులు ఐడీ కార్డుల‌ను ప‌రిశీలించి మ‌రీ పౌరుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. వారంతా పంజాబ్‌కు చెందినవార‌ని నిర్ధారించుకుని దాడి చేశారు. అలా 23 మంది పౌరుల‌ను చంపేశారు. ఈ దాడిలో 35 వాహ‌నాల‌ను కూడా త‌గల‌బెట్టారు.  

క‌లాత్‌లో పోలీస్ పోస్టు, హైవేపై జ‌రిగిన దాడిలో ఐదుగురు పోలీసులు, ఐదుగురు సామాన్య పౌరులు మృతిచెందారు. ఇక బోలాన్ ప‌ట్ట‌ణంలోని రైల్వే వంతెన‌పై ఉగ్ర‌వాదులు దాడి జర‌ప‌గా, స‌మీప ప్రాంతాల్లో ఆరుగురు చ‌నిపోయిన‌ట్లు రైల్వే అధికారి ముహ్మ‌ద్ కాషిఫ్ వెల్ల‌డించారు.

ప్ర‌ధానంగా పంజాబ్ ప్రావిన్స్ ను అనుసంధానించే హైవే వెంబ‌డి ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్రావిన్స్ లోని ప్ర‌జ‌లు హైవేల‌కు దూరంగా ఉండాల‌ని బ‌లూచిస్థాన్ లిబ‌రేష‌న్‌ ఆర్మీ (బీఎల్ఏ) హెచ్చ‌రించిన కొద్దిసేప‌టికే ఈ దాడులు జ‌రిగాయి.

సామాన్యులుగా ప్ర‌యాణిస్తున్న సైనిక సిబ్బందిని ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌మూక‌లు దాడులు జ‌రిపాయ‌ని పాకిస్థాన్ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. అయితే, చ‌నిపోయిన‌వారు సామాన్య ప్ర‌జ‌లేన‌ని తెలిపింది. కాగా, దాడుల్లో గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుల‌ను మెరుగైన వైద్య సేవ‌లు క‌లిగిన డేరా ఘాజీ ఖాన్‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. 

ముసాఖైల్ దాడిని పాక్ అధ్య‌క్షుడు అసీఫ్ అలీ జ‌ర్దారీ, అంత‌ర్గ‌త‌శాఖ మంత్రి మొహ్సీన్ న‌ఖ్వీ  అనాగ‌రిక చ‌ర్య‌గా పేర్కొన్నారు. దాడికి పాల్ప‌డిన వారిని వ‌దిలిపెట్ట‌బోమ‌ని చెప్పారు. అటు బ‌లూచిస్థాన్ సీఎం స‌ర్ఫ‌రాజ్ బుక్తీ కూడా ఉగ్ర‌దాడుల‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కాగా, అక్క‌డి మీడియా స‌మాచారం ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల్లో 12 మంది ఉగ్ర‌వాదుల‌ను సైన్యం, పోలీసులు మ‌ట్టుబెట్టినట్లు స‌మాచారం.

Related posts

ఇమ్రాన్‌ఖాన్‌పై ‘నేరపూరిత కుట్ర’ అభియోగం.. తేలితే మరణశిక్షే!

Ram Narayana

వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులోకి మరో ఇండియన్ అమెరికన్

Ram Narayana

అమెరికాలో భార‌తీయుడి న‌గ‌ల దుకాణంలో చోరీ.. మూడు నిమిషాల్లో లూటీ..

Ram Narayana

Leave a Comment